Kisan Samman | కరీంనగర్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : ఇక నుంచి ఈకేవైసీ ఉంటేనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వర్తించనున్నది. లేని రైతులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరదని, వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి ప్రియదర్శిని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులైన రైతులు తమ స్టేటస్ తెలుసుకునేందుకు (https://pmkisan.gov.in) ఫార్మర్ కార్నర్లో తెలుసుకోవచ్చు. ఈకేవేసీ లేనట్లయితే వెంటనే చేయించుకోవాలి. ఇది ఉంటేనే వచ్చే విడుత కింద ఎకరాకు రూ.2 వేల చొప్పున జమవుతాయని డీఏవో తెలిపారు. ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
ఒక వేళ చేసుకోని రైతులు తమ మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్లో పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. (https://pmkisan.gov.in లాగిన్ అయితే, అక్కడ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్ కచ్చితంగా రైతుల వద్ద ఉండాలి. అప్పుడే ఆన్లైన్లో ఓటీపీ నంబర్లు నమోదు చేసి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఒక వేళ మొబైల్ నంబర్‌తో ఆధార్ లింక్ కాకుంటే బయోమెట్రిక్ లేదా ఫేస్ ఆప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇందుకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని గానీ, మండల వ్యవసాయ అధికారినిగానీ సంప్రదించాలని డీఏవో సూచించారు.
ఈ పథకం కింద ఎవరైనా రైతులు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారాగానీ, లేదా స్వయంగా గానీ నమోదు చేసుకున్న తర్వాత వారి ఖాతాల్లో ఇంకా డబ్బులు జమకానట్లయితే పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ వివరాలతో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని గానీ, మండల వ్యవసాయ అధికారిని గానీ సంప్రదించాలని ఆమె కోరారు. ఫార్మర్స్ కార్నరల్ ఆధార్ వెరిఫికేషన్ స్టేటస్ పెండింగ్ అని చూపించింనట్లయితే వెంటనే www.pmkisan.gov.in లో లాగినై ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవాలని, ఆ తర్వాతనే పథకం కింద నగదు రైతుల ఖాతాలో జమవుతుందని తెలిపారు.
అలాగే, బ్యాంక్ వివరాలు తప్పుగా నమోదు కావడం, ఇతర కారణాల వల్ల డీబీటీ ఫెయిల్/పీఎఫ్ఎంఎస్ రిజెక్షన్ అని వచ్చిన వెంటనే బ్యాంక్ ఖాతా పుస్తకం, ఆధార్ కాపీతో వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించి ఆధార్ సీడింగ్, ఎన్పీసీఐ మ్యాపింగ్ చేయించుకోవాలని సూచించారు. ఇందు కోసం 2019 ఫిబ్రవరి 1 నాటికి రైతులు పట్టాదారులై ఉండాలని, కుటుంబంలో ఒక్కరు మాత్రమే లబ్ధిదారులై ఉండాలని, మైనర్ కొడుకు, కూతురు పేర్లను వేరువేరుగా నమోదు చేయకూడదని, ఇన్‌కంటాక్స్ చెల్లిస్తున్న వారు, ప్రొఫెషనల్స్, ఉద్యోగస్తులు మొదలైన వారికి ఈ పథకం వర్తించదనే విషయాన్ని రైతులు గమనించాలని స్పష్టం చేశారు.