కార్పొరేషన్, అక్టోబర్ 19: నగరంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని 60 డివిజన్లలో బతుకమ్మ ఆడే ప్రాంతాలతో పాటు నిమజ్జన కేంద్రాల వద్ద చేపట్టే ఏర్పాట్లపై ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పండుగ కోసం నగరపాలక సంస్థ సుమారు రూ. 2.50 కోట్ల మేరకు వ్యయం చేస్తున్నది. సద్దుల బతుకమ్మ పండుగకు ఎక్కడా మహిళలకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నారు.
నగరంలో సద్దుల బతుకమ్మ ఆడే అన్ని ప్రాంతాల్లో, నిమజ్జన కేంద్రాలకు వెళ్లే రహదారుల్లోనూ పెద్ద ఎత్తున లైటింగ్‌తో ఇతర సదుపాయాల కల్పనపై దృష్టి పెడుతున్నారు. నగరంలో 16 నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో చదును చేయడంతో పాటు లైటింగ్, మంచినీటి సదుపాయం కల్పించనున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ నీరు ఎక్కువగా ఉండడంతో ఎలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు వీలుగా ముందస్తుగా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన భారీ కేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు.
నగరంలో బతుకమ్మల నిమజ్జనం కోసం మానేరు వాగు వెంట, కిసాన్‌నగర్‌లోని గార్లకుంట, మార్ఫెడ్, చింతకుంట, వేదభవనం మానేరు బ్రిడ్జి, ఎల్ఎండీ డ్యాం కట్ట వెంట వాటర్ ట్యాంక్ సమీపంలో, గౌతమినగర్‌లోని పీజీ కాలేజీ సమీపంలో, రాంచంద్రపూర్ సమీపంలో, శ్రీనగర్‌కాలనీ, సప్తగిరికాలనీ, మారండేయనగర్, మానకొండూర్, కొత్తపల్లి, రేకుర్తి చెరువుల వద్ద, వల్లంపహాడ్ బ్రిడ్జి, తీగలగుట్టపల్లి కెనాల్ వద్ద అన్ని సదుపాయాలు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో లైటింగ్, ఇతర సదుపాయాలు కల్పించాలన్న విషయంలో సమాలోచనలు చేస్తున్నారు.
ముఖ్యంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఆ మేరకు సదుపాయాలను కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో ఇబ్బందులు రాకుండా బారీ కేడ్లు ఏర్పాటు చేసి గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతామని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లలో అత్యధికంగా లైటింగ్ కోసమే వ్యయం చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. డ్యాం, ఇతర ప్రాంతాల్లో నీటి నిల్వలు అధికంగా ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు అన్ని నిమజ్జన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో లైటింగ్ సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నారు. అలాగే, ఆయా కాలనీల నుంచి డ్యాం వైపు వెళ్లే రహదారుల్లోనూ ప్రస్తుతం ఉన్న వీధి దీపాలకు తోడు ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.