కరీంనగర్లో ఈ నెల 3న పీఎంజే జ్యువెల్లరీలో జరిగిన దోపిడీ ఘటన రోజుకో ములుపు తిరుగుతున్నది. తాజాగా అందుతున్న సీసీ ఫుటేజీలు, పోలీసులకు చిక్కిన ఆధారాలను బట్టి చూస్తే దుండగలు అత్యంత పకడ్భందీగా ప్లాన్ అమలు చేసినట్టు బయటపడుతున్నది. దాదాపు నెల రోజులుగా రెక్కీ నిర్వహించి, దోపిడీకి పాల్పడినట్టు వెలుగులోకి వస్తున్నది. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని పరమేశ్వర లాడ్జీలో గత నెలలో మూడు సార్లు స్టే చేసినట్టుగా పోలీసులకు ఆధారాలు చిక్కాయి. అక్కడే పక్కా స్కెచ్ వేసిన దుండగులు.. ఈ నెల 1న ధర్మపురికి చేరుకొని, అక్కడి నుంచే ప్లాన్ అమలు చేసినట్టు గుర్తించారు. తాజా ఆధారాలను బట్టి చూస్తే పోలీసుల అంచనాలు తలకిందులైనట్టు తెలుస్తున్నది. దోపిడీ ముఠా గత నెలలో మూడుసార్లు పెద్దపల్లిలో మకాం వేసి ప్రణాళిక రచించినా.. నిఘా వర్గాలు పసిగట్టకపోగా, దోపిడీ అనంతరం కూడా దొరక్కుండా పరారైన తీరు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.
కరీంనగర్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ధర్మపురి : నగల దోపిడీ ముఠాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తున్నది. నిజానికి ఒకటి రెండు రోజుల ముందు ప్లాన్ చేసుకొని దోపిడీకి పాల్పడి ఉంటారని అందరూ ఇప్పటివరకు భావించారు. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు జరిపారు. కానీ, ముఠా మాత్రం చాలా పకడ్బందీ ప్రణాళికతో దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా ఏప్రిల్‌లో సదరు ముఠా సభ్యులు పెద్దపల్లికి చేరుకున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ‘నమస్తే తెలంగాణ’కు అందిన సమాచారం ప్రకారం చూస్తే.. ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో (రూం నంబర్ 105)ను గత నెలలో మూడుసార్లు అద్దెకు తీసుకున్నట్టు తెలిసింది. వచ్చిన ప్రతిసారి రోజుల తరబడి ఇక్కడే మకాం వేసినట్టు, ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చినట్టు అక్కడి సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదని సమాచారం.
ఇక్కడ బోగస్ ఆధార్‌కార్డులు ఇచ్చి రూంలు బుక్ చేశారు. నిజానికి ఇక్కడి నుంచే నగల దుకాణం దోపిడీకి రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తున్నది. అయితే ఒక్క పీఎంజే జ్యువెల్లరీకి మాత్రమే రెక్కీ నిర్వహించారా..? లేక ఇతర నగల షాపుల ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, గత నెలలో మూడు సార్లు మకాం వేసిన దుండగులు, ఒక సారి మూడు రోజులు, మరోసారి నాలుగు రోజులు, ఇంకోసారి మూడు రోజులు ఉన్నట్టు తెలుస్తున్నది. అంటే గత నెలలో దాదాపు వారానికిపైగా అక్కడ మకాం వేసినట్టు తెలిసింది. ఇక్కడి నుంచి పలుసార్లు రెక్కీ నిర్వహించారు. ప్రధానంగా దోపిడీ జరిగిన తర్వాత ఎన్ని గంటల్లో తప్పించుకోవచ్చు? పోలీసుల కంట పడకుండా ఎలా పారి పోవచ్చు? అందుకోసం ఎంచుకోవాల్సిన దారులు ఏంటి? దోపిడీ ఘటనతో పోలీసులు అలర్ట్ అయినా కంట పడకుండా వెళ్లే దొడ్డిదారులేవి? అన్న కోణంలో ఆరా తీసి, అందుకు అనుగుణంగా రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తున్నది. నగల దోపిడీకి సంబంధించి పూర్తి ప్రణాళిక పెద్దపల్లిలోనే రూపుదిద్దుకున్నట్టు సమాచారం. అయితే దుండగులు నెలలో మూడుసార్లు దాదాపు వారం పాటు పెద్దపల్లిలోనే ఉన్నా నిఘావర్గాలు ఏం చేశాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిఘావర్గాలకు ఏమాత్రం అనుమానం రాకుండా వారు వ్యవహారం నడిపారంటే.. దోపిడీలో దొంగలు ఎంతటి సిద్ధహస్తులో అర్థమవుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు రోజుకో కోణం వెలుగులోకి వస్తుండడంతో వారే నివ్వరపోతున్నారు.
దుండగులు మొత్తం ఆరుగురు.. యాక్షన్‌లో ఐదుగురు
దోపిడీలో ఇప్పటివరకు ఐదుగురు ముష్కరులు మాత్రమే పాల్గొన్నట్టు అనుమానించినా.. లాడ్జి వద్ద లభ్యమైన వివరాలను చూస్తే ముఠా సభ్యులు ఆరుగురు ఉన్నట్టు తెలుస్తున్నది. ఐదుగురు ప్రత్యక్షంగా పాల్గొనగా, మరో వ్యక్తి బయటి నుంచి సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో ఐదుగురు హిందీ భాషలో మాట్లాడగా.. ఒకరు మాత్రం కొంత తెలుగు, హిం దీ రెండు భాషల్లో మాట్లాడినట్టు లాడ్జి యాజమాని పోలీసులకు తెలిపాడు.
దొరికిన బైక్.. అదే రోజు సరిహద్దులు దాటారా..?
దుండగులు ఉపయోగించిన రెండు వాహనాల్లో ఒకటి మంగళవారం ధర్మపురి క్షేత్రంలోని మహాలక్ష్మి పుష్కరఘాట్‌కు దగ్గరలో లభించింది. పోలీసుల అంచనా ప్రకారం.. నిందితులు బైక్‌ను అక్కడే వదిలేసి కాలినడకన గోదావరి దాటి ఆదిలాబాద్ వైపు చేరి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు మమ్మురం చేసిన పోలీసులు, మరో బైక్ ధర్మపురి నుంచి నక్కలపేట దోనూర్, బీర్పూర్ నుంచి కలమడుగు వంతెన దాటినట్టు సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించినట్టు తెలుస్తున్నది. ఈ కేసును చేధించేందుకు పోలీసులు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి కరీంనగర్లో దోపిడీ జరిగిన ప్రదేశం నుంచి వందలాది సీసీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. ధర్మపురికి చేరుకున్నారు. అక్కడ పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ తర్వాత దుండగులు కరీంనగర్ శాతావాహన యూనివర్సిటీ, మల్కాపూర్, వెలిచాల, కొత్తపల్లి, రుద్రారం, రామడుగు నుంచి పెగడపల్లి మండలం నామాపూర్, గొల్లపల్లి మండలం మీదుగా బుగ్గారం మండలం మద్దునూర్ గండి రోడ్ నుంచి ధర్మపురి మండలం తిమ్మాపూర్ వద్ద 63వ నంబర్ జాతీయరహరహదారికి చేరుకున్నారు.
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్మపురికి రెండు బైక్‌లు చేరుకున్నట్టు ధర్మపురి శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సీసీ ఫుటేజీలో బయట పడింది. ఆ తర్వాత అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న దుర్గాకాలనీ వెళ్లే దారిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే.. ఒక అపాచీ బైక్ మాత్రమే వెళ్లినట్టు రికార్డయింది. ఆ మేరకు గాలింపు చర్యలు చేపట్టగా, గోదావరి తీరాన మహాలక్ష్మి ఘాట్ సమీపంలో పల్సర్ బైక్ (టీఎస్ 09 ఎఫ్జీ 6876) లభ్యమైంది. బైక్‌తోపాటు బ్లూకలర్ హెల్మెట్, తాగిపడేసిన వాటర్‌బాటిల్‌ను కూడా కొంత దూరంలో వదిలేసినట్టు జాగిలం ద్వారా పోలీసులు కనుగొన్నారు. జాగిలం ట్రాకింగ్ ఆధారంగా దుండగులు అక్కడి నుంచి కాలినడకన గోదావరి నది దాటినట్టు భావిస్తున్నారు. పల్సర్‌కు అమర్చిన నంబర్ ప్లేట్ కూడా ఫేక్ అని గుర్తించారు. ఈ నంబర్ హైదరాబాద్‌లోని ఓ కారుదిగా నిర్ధారించారు. ముషిరాబాద్‌కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి సంబంధించిందిగా గుర్తించారు.
దొంగలు ముందుగానే పక్కా ప్రణాళికతో ఫేక్ నంబర్ ప్లేట్లు అమర్చుకొని, సెల్ఫోన్లు మార్చుకొని పథకం ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. పలుసార్లు రామడుగు మీదుగా రాష్ట్ర సరిహద్దులు దాటే విషయంలో రెక్కీ నిర్వహించి ఉంటారని, ఆరుగురిలో తెలుగులో మాట్లాడిన వ్యక్తికి కరీంనగర్ భౌగోళిక స్థితిగతులు తెలిసి ఉంటాయని భావిస్తున్నారు. ఆదివారం ఉదయం 11.11 గంటలకు దోపిడీ పూర్తయిన అనంతరం ధర్మపురికి ఒకటిన్నర వరకు దొంగలు చేరుకున్నారంటే.. చాలా పకడ్బందీ ప్లాన్‌తో వెళ్లినట్టు అర్థమవుతున్నది. ధర్మపురి నుంచి రాయికల్ మండలంలోని బోర్నపల్లి వంతెన మీదుగా గోదావరి దాటి కడెం, నిర్మల్ గుండా మహారాష్ట్రకు చేరుకున్నారా..? సారంగాపూర్ మండలంలోని కమ్మునూరు వద్ద గోదావరి వంతెన దాటి జన్నారం మీదుగా కూడా మహారాష్ట్రకు వెళ్లారా..? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. దొంగలు దోపిడీ జరిగిన రోజు సాయంత్రం ఐదు గంటలలోపే రాష్ట్ర సరిహద్దులు దాటినట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పది టీములు మహారాష్ట్ర, బిహార్‌కు వెళ్లినట్టు తెలుస్తున్నది. ముఠా సభ్యుల్లో ఇద్దరు పాత నేరస్థులు ఇంతియాజ్, షాబుద్దీన్గా గుర్తించారని, ముగ్గురిని పట్టుకున్నారన్న ప్రచారాన్ని పోలీసులు మాత్రం ఖండిస్తున్నారు. అయితే.. ఈ దర్యాప్తులో ఇంకా ఎన్ని మలుపులుంటాయో అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతుండగా, పోలీసులు కంటిమీద కునుకు లేకుండా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆధారాలు బయటపడుతున్న నేపథ్యంలో త్వరలోనే గ్యాంగ్‌ను పట్టుకుంటామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ధర్మపురి నుంచి అమలు
పెద్దపల్లిలో ప్రణాళిక సిద్ధం చేసుకున్న సదరు దొంగలు, ఆ ప్లాన్‌ను ధర్మపురి కేంద్రంగా అమలు చేశారు. అందుకోసం ఈనెల ఒకటిన ధర్మపురికి చేరుకొని, స్థానిక హరిత హోటల్ రోడ్డు వైపు ఉన్న విజయలక్ష్మి వసతి గృహంలో రెంగు గదులను అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు, ఏసీ గదిని (రూ.1200) అద్దెకు తీసుకున్నారు. రూం ఇవ్వడానికి హోటల్ యజమాని ఆధార్ వివరాలు అడిగితే.. సౌరవార్ కుమార్, జార్ఖండ్ ఉన్న ఆధార్ చూపించారు. అదే పేరును రిజిస్టర్లో నమోదు చేసి, సెంకండ్ ఫ్లోర్‌లోని నాలుగో నంబర్ గది అలాట్ చేశారు. మరుసటి రోజు అంటే శనివారం ఉదయం 10 గంటలకు ముఠాకు చెందిన మరో వ్యక్తి హోటల్‌కు రాగా, గదిలో ఐదుగురు ఉండడానికి ఒప్పుకోమని లాడ్జి యజమాని గుండయ్య అభ్యంతరం చెప్పారు. దీంతో ఏసీ గదులు ఖాళీ లేకపోవడంతో రూ.600 అద్దె చెల్లించి మొదటి అంతస్తులోని నాన్ ఏసీగదిని అదే సౌరవార్ కుమార్ పేరుతోనే అద్దెకు తీసుకున్నారు.
అదే రోజున మధ్యాహ్నం 2గంటలకు మరోవ్యక్తి వచ్చి దుండగుల గ్యాంగ్‌లో చేరారు. వీరికి భోజనం కూడా పక్కనే ఉన్న హోటల్ శ్రీనిలయంలో లాడ్జ్ యజమాని గుండయ్య ఆర్డర్ చెప్పగా, హోటల్ యజమాని మాదాసు సత్తయ్య వీరందరికీ భోజనం తీసుకొచ్చి ఇచ్చినట్టు విచారణలో తేలింది. పెద్దపల్లిలో గత నెలలో మకాం వేసిన దుండగలు.. ధర్మపురి పుణ్యక్షేత్రాన్నే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారన్నది పోలీసులకు ప్రశ్నగా మారింది. ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న వారెవరైనా సహకరించారా..? ఆ ఆరో వ్యక్తి ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అంచనాల ప్రకారం వ్యూహాత్మక కారణాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ధర్మపురి భక్తుల ముసుగులో జనసందోహంలో సులభంగా కలిసిపోయి, ఎవరికీ అనుమానం రాకుండా దుండగులు తమ కార్యకలాపాలు కొనసాగించడానికి ఆస్కారం ఉన్నదని భావిస్తున్నారు. ధర్మపురి నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండడం, ఇక్కడి నుంచి ఆదిలాబాద్, అక్కడి నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు వెళ్లే మార్గం ఉండడంతో ధర్మపురిని ఎంచుకున్నట్టు అనుమానిస్తున్నారు.