Timmapoor | తిమ్మాపూర్, మే19: వాననక, ఎండనక కష్టపడి ధాన్యం పండించిన రైతులకు వడ్లు పోసుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలం అవుతున్నారు. వెరసి చేసేదేం లేక రైతులు రోడ్లపై ఒక పక్కమొత్తం వడ్ల కుప్పలు పోస్తుండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ధాన్యం రాశులు వాహనదారులు, ప్రయాణికుల పాలిట మృత్యుకూపాలుగా మారుతున్నాయి. వడ్లరాశుల వద్ద అదుపుతప్పి వారంలోనే ఇద్దరు మృతిచెందారు.
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
రైతులకు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్తితి ఉన్నది. చాలా గ్రామాల్లో స్థలం ఉన్న చోట కేంద్రాలను ఒక చోట నిర్వహిస్తుండగా.. ప్రధానంగా డబుల్ రోడ్డు, సింగిల్ రోడ్డు ఉన్న గ్రామాల్లో అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో రైతులు చేసేదేం లేక రోడ్లపై ఒక పక్క ఆక్రమించి వడ్లను రాశులు పోసి, ఆరబోస్తున్నారు. పలుచోట్ల సీడ్వడ్లు సైతం ఆరబోసి ఉంచుతున్నారు. ఒక్కో చోట సగానికిపైగా రోడ్డుకు ఆక్రమించేస్తున్నారు. దీంతో ప్రధానంగా రాత్రి సమయాల్లో వడ్ల రాశులు కనిపించక.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి, అదుపుతప్పి వాహనాలు వడ్ల రాశులపై దూసుకెళ్లడంతో కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. కిందపడి స్వల్పగాయాలతో వెళ్లిపోతున్న ప్రయాణికులు కోకొల్లలుగా ఉన్నారు.
బాధ్యత లేని అధికారులు..
ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారంటే.. కేంద్రానికి కొంత స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ రైతులకు అన్ని వసతులు. కల్పించాల్సిన అవసరం రైతులకు ఉన్నది. కానీ రైతులు వడ్లు పండించారా.. తాము కొన్నామా లేదా అన్నచందంగా తయారైంది అధికారుల తీరు. కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఎక్కడబడితే అక్కడ వడ్లను కుప్పలుగా పోస్తున్నారు. పోసిన కుప్పలపై పరాదాలు కప్పడంతో రోడ్డుపై రాశులు ఉన్నట్లు కనిపించడం లేదు. అలాగే వాటి పక్కడ బండరాళ్లు పెడుతుండడంతో మరింత ప్రమాదాలు జరుగుతున్నాయి.
వారంలోనే ఇద్దరు మృతి..
ఈ యాసంగి పంట కొనుగోళ్లు ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. ఈనెల10న వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన కొమ్మిడి మణెమ్మ, సమ్మిరెడ్డి భార్యభర్తలు రోజంతా కరీంనగర్ లో పని చూసుకుని రాత్రి సమయంలో ఇంటికి వెళ్తుండగా మామిడాలపల్లి, పచ్చునూర్ గ్రామాల మధ్య రోడ్డుపై పోసిన ధాన్యం కుప్పలు కనిపించక వారి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో మణెమ్మ, సమ్మిరెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. సమ్మిరెడ్డి కోలుకున్నప్పటికీ.. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మణెమ్మ నాలుగు రోజులకు మరణించింది.
అలాగే కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల రంజిత్ తన స్నేహితుడు సాజిత్ కలిసి తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో పని చూసుకుని శనివారం రాత్రి కరీంనగర్ వైపు వెళ్తుండగా మల్లాపూర్ శివారులో రోడ్డుపై పోసిన వడ్లరాశిపైకి బైక్ ఎక్కడంతో ఇద్దరు కిందపడిపోయి గాయపడ్డారు. తలకు తీవ్రగాయమైన రంజిత్ అక్కడికక్కడే మృతిచెందాడు.
అనేకమందికి గాయాలు
ఇలా వడ్ల రాశుల బాధితులు ఎంతోమంది ఉంటున్నారు.. కానీ చాలామంది స్వల్పంగా గాయపడ్డవారు వెళ్లిపోతున్నారు. ఇటు రైతులను నిందించలేక.. అధికారులను ప్రశ్నించలేక మిన్నుకుండిపోతున్నారు. కేవలం ప్రమాదం పెద్దస్థాయిలో జరిగినప్పుడు మాత్రమే ఇలా బయటికి తెలుస్తున్నాయి. ఇకనుండైనా అధికారులు తీరు మార్చుకుని రైతులకు కల్లాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రోడ్డుపై ధాన్యం ఆరబోయకండి : సదన్ కుమార్, సీఐ, తిమ్మాపూర్
రైతులు పండించిన ధాన్యాన్నిరోడ్లపై ఆరబోయకూడదు. మా సర్కిల్ పరిధిలోని తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో ఎక్కడ కూడా రోడ్డుపై వడ్లు ఉండకూడదని ఆదేశించిన తెలిసీతెలియక పోసినా వెంటనే తీసేయాలని సూచించాం. చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతున్నాయి. రోడ్లపై వడ్లుపోసి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తీసుకుంటాం. రైతులకు అవగాహన కోసం అన్ని గ్రామాల్లో చాటింపు వేయించాం.