రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్న అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు. ‘ఆరోగ్య శాఖ నుంచి ఫోన్ చేస్తున్నం. హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ చేస్తం’ అంటూ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన బాధితులకు టోకరా పెట్టి, ఏకంగా రూ. 60లక్షలు కాజేసిన నిందితుడిని సిరిసిల్ల సైబర్ క్రైం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అందుకు సంబంధించి డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి వివరాలను మంగళవారం వెల్లడించారు. కడప జిల్లా జమ్ముల మడుగులోని భాగ్యనగర్‌కి చెందిన ముల్లుంటి సలీం మాలిక్ (32), ఢిల్లీకి చెందిన సతీశ్ కలిసి కొత్త రకం మోసాలకు ఒడిగట్టారు. పలు దవాఖానల్లో చికిత్స చేయించుకున్న వారి వివరాలు సేకరించి, ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నామంటూ బాధితులకు ఫోన్ చేసేవారు. హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ చేస్తామని నమ్మించే వారు. సెల్‌ఫోన్ ద్వారా లింక్ పంపించి, ఓపెన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మీ యొక ఆరోగ్యశ్రీలో ఖర్చయిన డబ్బులు తిరిగి మీ అకౌంట్లో జమవుతాయని చెప్పేవారు. లింక్‌పై క్లిక్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే వారి ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ అయ్యేవి. వీరి మోసాల వలలో పడ్డ ముస్తాబాద్ మండలానికి చెందిన రాజిరెడ్డి 46 వేలు నష్టపోయాడు.
ఆరోగ్యశ్రీ ఖర్చులు జమకాకపోగా, ఖాతాలో ఉన్న డబ్బులు డ్రా కావడంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీశాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాచారంతో రాజిరెడ్డి ముస్తాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు ముస్తాబాద్ ఎస్ఐ గణేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ మహేశ్ గితే ఆదేశాలతో సిరిసిల్ల రూరల్ మొగిలి ఆధ్వర్యంలో ఎస్ఐ గణేశ్, జిల్లా సైబర్ టీం ఆర్ఎస్ఐ జునైద్, సిబ్బంది కిట్టు, గంగారెడ్డి, కాసిం బృందం రంగంలోకి దిగింది. సాంకేతికత ఆధారంగా నిందితుడిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడు సలీం మాలిక్ పై తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టాలలో 79 కేసులు నమోదు కాగా, దాదాపు 60 లక్షల వరకు మోసం చేసినట్టు డీఎస్పీ తెలిపారు. మరోనిందితుడు సతీశ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని పట్టుకున్న సైబర్ టీం, పోలీసు అధికారులను డీఎస్పీ అభినందించారు. మొబైల్ ఫోన్ ద్వారా వచ్చే మేసేజ్, ఇలాంటి వాటిని ప్రజలు నమ్మకూడదన్నారు. సైబర్ నేరాలు ఎక్కువైతున్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.