Petrol Out of Stock | కోల్ సిటీ, ఏప్రిల్ 27: ‘ఇంధనం కొరత లేదు.. నిల్వలు సమృద్ధిగానే ఉన్నాయని’ పౌర సరఫరాల శాఖ చెబుతోంది. కానీ, హఠాత్తుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తోంది. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన గల పెట్రోల్ బంక్ సోమవారం ఉదయం నుంచే నో స్టాక్ సాకుతో మూసివేశారు. దీంతో అత్యవసరంగా పెట్రోలు, డీజిల్ కోసం వచ్చిన వాహనదారులు గత్యంతరం లేక బయట దుకాణాల్లో బ్లాక్ లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. మరి కొందరు మిగతా ఏరియాల్లో గల పెట్రోల్ బంక్ ల వద్దకు పరుగులు తీయగా అక్కడ అదే పరిస్థితి ఉండడంతో పెట్రోల్ కోసం మరోచోటకు తిరగాల్సి వచ్చింది.
కాగా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలయ్యాక ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో కొన్ని బంక్ ల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయిల్ కంపెనీల నుంచే సకాలంలో ఇంధనం సరఫరా కాలేదని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. ఇంధన ధరలు పెరుగుతున్నాయని సోషల్ మీడియాలో కూడా ప్రచారం వైరల్ కావడంతో పారిశ్రామిక ప్రాంతంలో పెట్రోలు, డీజిల్ కోసం వాహన చోదకులు బంకుల వద్దకు ఎగబడ్డారు.