వేములవాడ, సెప్టెంబర్ 22: రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతున్న కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేద్దామని, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు విజయానికి తమ వంతుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. వచ్చే శాసనసభా ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ మంత్రి కేటీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌తో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, నియోజకవర్గ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ, మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కష్టపడి పనిచేయాలని నిర్ణయించినట్లు వివరించారు.
నియోజకవర్గంలో పెండింగ్ పనులు నిధుల మంజూరుకు అనుమతులు ఇవ్వాలన్నారు. ప్రధానంగా కలికోట సూరమ్మ చెరువు అనుమతులు, తాండ్రియాల-కొడిమ్యాల, మోహన్‌రావుపేట-దేశాయ్‌పేట డబుల్ రోడ్లు, రాళ్ల వాగు ప్రాజెక్టు, మన్నెగూడేం, రుద్రంగిలో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్నారు. చందుర్తి- మోత్కురావుపేట ఫారెస్టు అనుమతులు, మిగిలిన ఎల్లంపల్లి పనులు, కోనరావుపేట మండలంలో రూ.52 కోట్లతో బిడ్జి నిర్మాణం, ముంపు గ్రామాలకు అవసరమైన రూ.30 కోట్లు, సంకెపల్లిలో 45 ఇండ్లు, శభాష్‌పల్లి- నందికమాన్ దాకా రోడ్డు నిర్మాణం, ముంపు గ్రామాల యువతకు ఉపాధి, దేవాయాలభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.50 కోట్లు, పట్టణంలో రోడ్డు వైండింగ్, డ్రైనేజీ రోడ్ల నిర్మాణాలకు రూ.30 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
నిర్మాణంలో ఉన్న 144 ఇండ్ల నిర్మాణానికి అవసరమైన రూ.2 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైల్వేలైన్ బాధితుల నష్టపరిహారం చెల్లింపు, ప్రధానమైన రోడ్లు నిర్మాణాలు ఉన్నాయన్నారు. అలాగే పరిపాలన సౌలభ్యం కోసం మండలాల ఏర్పాటు, పాక్స్ సెంటర్ల భైపర్గేషన్, బావుసాయిపేట స్లూయిస్, రంగాపూర్ ప్రాజెక్టు ఆధునీకరణ అనుమతులు, తండాల్లో రోడ్లు, మొదలగు వాటిపై నివేదికలను మంత్రి కేటీఆర్‌కు అందించామన్నారు. వాటిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ప్రధాన పనులు వెంటనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అనుమతులకు కృషి చేస్తామన్నారు. వచ్చే ఎన్నికలోల నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించి మండల ఎన్నికల సమన్వయ కమిటీల ద్వారా బీఆర్ఎస్ విజయానికి సన్నద్ధం కావాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్, నియోజకవర్గ బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఫ్యాక్స్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.