Godhavarikhani | కోల్ సిటీ , మార్చి 31: ప్రజల ప్రాణాలు పోతున్నా.. రామగుండం ప్రజాప్రతినిధులకు, హెచ్ కేఆర్ అధికారులకు ఏమాత్రం సోయి లేదని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖని జీఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రజాప్రతినిధులకు బాధ్యత లేకుండా వ్యవహరించడం శోచనీయమని పేర్కొన్నారు.
జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని సీపీఐ నాయకులు గోసిక మోహన్, గౌతం గోవర్ధన్‌లతో కలిసి సోమవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్య ప్రజాప్రతినిధితోపాటు మున్సిషల్ అధికారులు, హెచ్కీఆర్ అధికారులు తమకు రాబడి వచ్చే పనులపైనే దృష్టి పెడుతున్నారే తప్ప ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బసంత్‌నగర్ వద్ద టోల్ గేట్ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న అధికారులు ప్రమాదాల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా గంగానగర్ నుంచి రామగుండం వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, లేనిపక్షంలో టోల్ గేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, మడికొండ ఓడమ్మ, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.