Medicover Hospital | పెద్దపల్లి, ఫిబ్రవరి 14: పారాకుట్ (గడ్డిమందు) తాగిన వారిని నాలుగైదు గంటల్లోపు ఆస్పత్రికి తీసుకురాగలిగితే వారిని బతికించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి నెఫ్రాలజిస్టు డాక్టర్ రాంచందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎక్కువగా ఎండోసల్ఫాన్ మందు తీసుకునే వారని దానికి విరుగుడు ఉండడంతో దాదాపుగా అందరిని కాపాడగలిగామన్నారు. ఇటీవల ఆత్మహత్యలన్నీ గడ్డి మందుతోనే జరుగుతున్నాయని, విరుగుడు లేకపోవడం వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
కానీ గడ్డి మందు తాగిన వారిని 4 నుంచి 5 గంటల్లోపు ఆస్పత్రి తీసుకురాగలిగితే.. ఏయే సమయంలో ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ మందులు ఇవ్వాలనేది సరిౖయెన సమయంలో ఇచ్చి ఐదారు దశల్లో చికిత్స అందిస్తూ బ్రతికించగలుగుతున్నామని తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం గడ్డి మందు తాగితే 100 శాతం చనిపోయే పరిస్థితి నుంచి ప్రస్తుతం 25 శాతం బతికించే పరిస్థితికి వచ్చామన్నారు. ఇప్పటి వరకు మెడికవర్ లో గడ్డి మందు తాగిన 200 మంది షెపెంట్లను ట్రీట్ చేసి 52 మంది దాకా బతికించగలిగామని వెల్లడించారు. స్పెషల్ ఫిల్టర్లు, అధునాతన చికిత్స సహాయంతో ఇది సాధ్యపడుతుందని తెలిపారు. గడ్డిమందు తాగిన పేషెంట్‌ను తరలించేటప్పుడు ఆక్సిజన్‌ను పెట్టకూడదని తెలిపారు. ఆక్సిజన్‌తో లంగ్స్ లోకి వెళ్లే ప్రమాదముందన్నారు.
ఇక స్టోన్ బెల్ట్‌గా పేరున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతాల్లో కిడ్నీల్లో రాళ్లు ఎక్కువగా వస్తాయన్నారు. షుగర్, బీపీ ఉన్న వాళ్లు స్టోన్స్‌ని సరిగా పట్టించుకోకపోవడం, కొంతమంది మామూలు నడుం నొప్పిగా భావించి పేయిన్ కిల్లర్స్ వాడడం అలవాటుగా మారిందని, దీంతో కిడ్నీలు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశముందన్నారు. జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీ సమస్యల నుంచి బయటపడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు, క్రిటికట్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, బొంగోని హరీష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.