Amber Kishore Jha | కోల్ సిటీ, జనవరి 16 : రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఈ మార్పు ముందు ప్రభుత్వ ఉద్యోగుల నుంచే రావాలని, మిమ్మల్ని చూసి హెల్మెట్ ధరించాలన్న ఆలోచన అందరిలో కలగాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. రోడ్డు భద్రత నియమాలపై శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆర్అండ్బీ, రవాణా, వైద్య, విద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఆర్టీసీ తదితర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు గోదావరిఖని వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్.. అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమేనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు భద్రత పాటిస్తూ ప్రజలకు సంకేతమివ్వాలని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల కారణంగా నష్టపోతున్న వారిలో 70 శాతం యువతే ఉన్నారని, భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల కుటుంబంకు జరిగే నష్టంను ఎవరూ పూడ్చలేరని ఈ విషయమై ప్రజల్లో చైతన్యం తీసుకరావల్సిన బాధ్యత ప్రతీ ప్రభుత్వ ఉద్యోగిపై ఉందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలన్నారు. 18 ఏండ్లు నిండని పిల్లల చేతికి వాహనాలు ఇవ్వకూడదన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నది ప్రజల క్షేమం కోసమే అని గుర్తించాలన్నారు. ఇటీవల తల్లిదండ్రులు చాలా మంది పిల్లలకు వాహనాలు ఇస్తూ సంతోష పడుతూ అదొక ప్రెస్టేజిగా భావిస్తున్నారని, అనుకోకుండా వారు రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు అందుకు కారణం తల్లిదండ్రులే అన్నది గుర్తించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయనీ, హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక కమిషనర్ జే అరుణ శ్రీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తమవంతు బాధ్యతగా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ఇటీవల ప్రధాన రోడ్డుకు ఇరువైపుల గల ఫుట్ పాత్ ను వినియోగంలోకి తీసుకవస్తున్నట్లు తెలిపారు.
మున్సిపల్ ఉద్యోగులు క్రమశిక్షణతో హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత పాటించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పలువురు మున్సిపల్ ఉద్యోగులకు సీపీ అంబర్ కిశోర్ ఝా ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ, గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, సిమ్స్ ఆర్ఎంఓ కృపాబాయి, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ఎంఈఓ మల్లేశం, ఎస్ఐ రమేష్, అనూషతోపాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.