Korutla | కోరుట్ల, ఆగస్టు 13: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించి, అందులో నివాసం ఉంటున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. శిధిలావస్థలో ఉండి నివాసయోగ్యం కాని పలు ఇళ్లను కూల్చి వేయాలన్నారు. ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9100039255కు అత్యవసర సమయంలో సహయం కోసం సంప్రదించాలన్నారు.
ఏడు కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించిన అధికారులు..
పట్టణంలోని మున్సిపల్ అనుబంధ గ్రామం ఎఖీన్పూర్ గ్రామానికి చెందిన ఏడు కుటుంబాలకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అధికారులు తాత్కలికంగా పునరావాసం కల్పించారు. శిధిలావస్థలో నివాసం ఉంటున్న వీరిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా అధికారులు పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించారు. భోజన సదుపాయం, ఇతర ఏర్పాట్లు చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని పలువురికి అధికారులు నోటీసులు అందజేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.