హైదరాబాద్: జూబ్లీహిల్స్ విజేత ఎవరో (Jubilee Hills Results)మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో (Jubilee Hills By-Election Results) ప్రారంభం కానుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు పోస్ట్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం షేక్‌పేట డివిజన్ ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపులో 186 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 42 టేబుల్లను ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. ఒక్కో రౌండుకు 45 నిమిషాల సమయం పట్టనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ క్యాండిడేట్ దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 99,771 మంది పురుషులు, 94,855 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. బోరబండ్ డివిజన్లో 29,760 మంది ఓట్లు వేయగా, రహమత్‌నగర్ డివిజన్లో 40,610 ఓట్లు పోలయ్యాయి. ఇక ఎర్రగడ్డ డివిజన్లో 29,112 ఓట్లు, వెంగళరావ్‌నగర్‌లో 25,195 ఓట్లు, షేక్‌పేట డివిజన్లో 31,182 ఓట్లు, యూసఫ్‌గూడలో 24,219 ఓట్లు, సోమాజిగూడలో 14,553 ఓట్లు పోలయ్యాయి.