వరంగల్, నవంబర్ 13: హనుమకొండ నడిబొడ్డులోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూమి వేలం వాయిదా పడింది. బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066/5లో గల 2.27 ఎకరాల భూమి అమ్మకానికి ‘కుడా’ ప్రకటన చేసినప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రూ. 100 కోట్ల విలువ చేసే భూమిని అధికార పార్టీ నేతలు దక్కించుకునేందుకు గంపగుత్తగా ఎకరాల్లో అమ్మకానికి పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీంతో శుక్రవారం నిర్వహించే వేలం పాటను వాయిదా వేస్తూ కుడా వైస్ చైర్మన్ చాహత్ బాజ్పాయ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తదుపరి వేలం పాటను ఎప్పుడు నిర్వహించే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అనివార్య కారణాలతో మాత్రమే వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే నవంబర్ 3న వేలం నిర్వహిస్తామని తొలుత ప్రకటించిన కుడా అధికారులు నగరాన్ని వరదలు ముంచెత్తిన నేపథ్యంలో దానిని 14వ తేదీకి వాయిదా వేశారు.