సిరిసిల్ల టౌన్, జూన్ 5 : ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆకాంక్షకు అనుగుణంగా కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు మనమంతా పాటుపడాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉందని చెప్పారు. బూత్ కమిటీల అధ్యక్షులు ఆయా వార్డుల్లో నిర్వహించబోయే సభ్యత్వ నమోదు ప్రక్రియలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ నెల 13న సిరిసిల్లలో నిర్వహించే సమావేశానికి ముఖ్య నేతలతో పాటు బూత్ కమిటీల అధ్యక్షులు హాజరుకావాలని సూచించారు.
సిరిసిల్ల మున్సిపల్లోని 6, 21, 25, 32, 36వ వార్డుల్లో శుక్రవారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశాలకు తుల ఉమ హాజరై మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్కు గతంలోనే 33వేలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఈ సభ్యత్వ నమోదుతో సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశం చేశారు. ఇటీవలి సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ నేతలు ఉద్యమ చైతన్యాన్ని చూపించారని అభినందించారు. పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందులో భాగంగా ప్రతి వార్డులో ఒక బూత్ కమిటీ, ప్రతి కమిటీలో ఇద్దరు అధ్యక్షులను నియమించుకోవాలని సూచించారు. బూత్ కమిటీలో ఉండే వారికి తమ వార్డులోని ప్రతి ఓటుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వార్డులోని ఓటరు జాబితో ఉన్న ఓట్లలో అన్ని సరైనవేనా? దొంగ ఓట్లు ఏమైనా ఉన్నాయా? క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
వార్డు నుంచి ఇచ్చిన బూత్ కమిటీ సభ్యుల పేర్లను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఎస్ఐఆర్ సర్వే జరుగుతున్న సమయంలో బూత్ కమిటీ సభ్యులు వారి వెంట ఉండి ఓటరు జాబితాలోని తప్పు, ఒప్పులను వారికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని, కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదును నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి విజయవంతం చేయాలన్నారు. వార్డుల వారీగా బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డిజిటల్ సభ్యత్వ నమోదులో భాగంగా మెంబర్షిప్ తీసుకున్న వారికి కార్డులు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పార్టీ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, ఆయా వార్డుల కౌన్సిలర్లు దూడం రజినీ, ఎలుక వెంకటేశం, బింగి రామాంజనేయులు, కల్లూరి రేణుక, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు సయ్యద్ తస్లీం, నాయకులు దూడం శ్రీనివాస్, కల్లూరి రాజు, సయ్యద్ అక్రం, తదితర నాయకులు పాల్గొన్నారు.