కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై కేంద్రం వివక్ష కొనసాగుతున్నది. సాధారణ నిధుల విషయంలోనే కాదు, రైల్వే కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కరీంనగర్-కాజీపేట(హసన్‌పర్తి) రైల్వేలైన్‌కు సంబంధించి ప్రస్తావనే లేకపోవడం నిరాశపరిచింది. కీలకమైన కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్‌కు నిధులు ఇచ్చినా, రాష్ట్ర వాటా మాత్రం అనుమానాలు రేకెత్తిస్తున్నది. మరో ప్రతిష్టాత్మకమైన మణుగూరు-రామగుండం-కోల్‌కారిడార్ లైన్‌కు కేవలం 5 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నది.
ఇన్నాళ్లూ జిల్లాకు వందే భారత్ రైలు వస్తుందని ఊరించినా, కేంద్రం ఆ ముచ్చటే మరిచింది. ఇదిలా ఉంటే దక్షిణ భారత దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, సౌకర్యాల మెరుగుకూ అణా పైసా కేటాయించకపోవడం, తిరుపతికి వీక్లీ సర్వీసులు పెంచకపోవడం పరిస్థితికి అద్దంపడుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటాన్ అకౌంట్ పద్దుకు ఈ బడ్జెట్‌కు మధ్య దాదాపు 300 కోట్లకుపైగా కత్తెర పడగా, ప్రజానీకం మండిపడుతున్నది. అందుకే ప్రతిసారి బడ్జెట్ రాగానే గొప్పలు చెప్పే బీజేపీ నాయకులు ఈసారి కావాలనే మౌనం వహించారని విమర్శిస్తున్నది. వీటన్నింటికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారోనని ఎదురుచూస్తున్నది.
కరీంనగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఈ నెల 23న ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అందులో రైల్వేలకు 2,62,200 కోట్లు కేటాయించగా, ఉమ్మడి జిల్లాకు మాత్రం అడుగడుగునా అన్యాయం జరిగింది.
అటు సాధారణ బడ్జెట్లో జాతీయ రహదారుల నుంచి మొదలు మెడికల్ కళాశాల, నవోదయ, ట్రిపుల్ ఐటీ వంటి వాటి కేటాయింపుల విషయంలో పక్షపాతం చూసింది. ఇటు రైల్వేకు సంబంధించి మొండిచెయ్యే దిక్కయింది. కనీసం ఈ రంగానికి సంబంధించి అయినా న్యాయం జరుగుతుందని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశించినా నిరాశే మిగిలింది. రైల్వే రంగం కేటాయింపులకు సంబంధించి ‘నమస్తే తెలంగాణ’కు అందిన సమాచారం ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాపై కేంద్రం వివక్ష చూపినట్లు తెలుస్తున్నది.
కరీంనగర్-కాజీపేట లైన్ ఊసేలేదు..
అత్యంత ప్రధానమైన కరీంనగర్-కాజీపేట(హసన్‌పర్తి) వయా హుజూరాబాద్ నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు మాజీ ఎంపీ వినోద్‌కుమార్ గతంలో కేంద్రాన్ని ఒప్పించిన విషయం తెలిసిందే. ఆ మేరకు డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసేందుకు రైల్వే బోర్డును కూడా ఆయన ఒప్పించగా, సర్వే కూడా పూర్తయింది. నిజానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇది అత్యంత ప్రధానమైన లైన్. కాజీపేట జంక్షన్‌తో ఒకసారి లింకు ఏర్పడితే ఉమ్మడి జిల్లా వాసులు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లడానికి సౌకర్యం కలుగుతుంది.
ఈ మేరకు మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కేంద్రాన్ని ఒప్పించినా దానిని కంటిన్యూ చేసి నిధులు కేటాయింపు చేసుకోవడంలో బండి సంజయ్ ఎప్పుడూ విఫలమవుతూనే ఉన్నారు. ఈ లైన్‌కు సంబంధించి తాజా బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరినట్లు బండి పలుసార్లు తెలిపినా, బడ్జెట్లో ఈ లైన్ ఊసే లేదు. కనీసం ‘చూస్తాం.. చేస్తాం’ అన్న ముచ్చట కూడా లేదు. ఇంత ప్రాధానత్య లైన్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రం ఉండడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బండి ఏం చెబుతారో..? చూడాలి.
రాష్ట్ర ప్రభుత్వంపై అనుమానాలు
కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్‌కు కేంద్రం గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 350 కోట్లు కేటాయించింది. అందులో రాష్ట్ర వాటాగా 112 కోట్లు వరకు వెచ్చించాలి. అంటే 2023-24 బడ్జెట్లో 185 కోట్లు కేటాయించారు. ఇప్పుడు తాజా బడ్జెట్లో 350 కోట్లు కేటాయించినట్టు కేంద్రం చెబుతున్నది. అయితే ఈ ఒక్క విషయం బాగానే కనిపిస్తున్నా రాష్ట్రం విడుదల చేయాల్సిన నిధులపైనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైన్ పొడవు 151.34 కిలోమీటర్లు కాగా, అందులో మెదక్ జిల్లాలో 9.30 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లాలో 83.40 కిలోమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 37.80 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 20.86 కిలోమీటర్లు ఉండగా.. నాడు 2016లో తెలంగాణ సర్కారు కేంద్రాన్ని ఒప్పించి మంజూరు చేయించింది. 1,167 కోట్లతో అంచనాలతో ప్రారంభించిన ఈ లైన్ ఇప్పటివరకు మనోహరాబాద్ నుంచి సిద్దిపేట దాకా పూర్తయి రైలుసేవలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 151 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఇప్పటివరకు 75కిలోమీటర్లు పూర్తయింది.
ప్రస్తుతం సిరిసిల్ల-సిద్దిపేట (37కి.మీ) భూసేకరణ ప్రక్రియ జరుగుతున్నది. నిజానికి ఈ లైన్పూర్తయితే రాష్ట్ర రాజధానితో అనుసంధానం ఏర్పడతుంది. అందుకే ఈ లైన్ కోసం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించారు. స్వయంగా ప్రధాని మోడీతో దీనికి శంకుస్థాన చేయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు సైతం తన నిధులను విడుదల చేసి, భూసేకరణ, ఇతర కార్యక్రమాలపై దృష్టిపెడితే తప్ప దీని లక్ష్యం నేరవేరదన్న అభిప్రాయాలున్నాయి.
భారీ కోతలు.. కోల్ కారిడార్‌కు మళ్లీ అన్యాయమే
రైల్వే బడ్జెట్లో ఈ సారి భారీకోతలు పడ్డాయి. ఈ యేడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు 673.43కోట్లు కేటాయించినట్టుగా లెక్కలు తేల్చారు. కానీ, ఈ సారి బడ్జెట్లో మరింత ఎక్కువగా వస్తుందని ఆశించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ సారి ఉమ్మడి జిల్లాకు రైల్వే రంగంపై వరాల జల్లు కరుస్తుందని ఆశించారు. కానీ బడ్జెట్ చూస్తే ప్రజలు ఆశలు ఆవిరయ్యాయి. కొత్తపల్లి – మనోహరాబాద్ (150 కిమీ) రైల్వేలైన్‌కు 350 కోట్లు కేటాయించిన కేంద్రం.
రామగుండం – మణుగూరు-కోల్‌కారిడార్ (202 కి.మీ) రైల్వేలైన్‌కు 5 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నది. ఉప్పల్ – జమ్మికుంట రైల్వే ఓవర్ బ్రిడ్జికి 2 కోట్లు, పెద్దపల్లి బైపాస్ (2.1 కి.మీ) లైన్‌కు లక్ష, పెద్దపల్లి – కరీంనగర్- నిజామాబాద్ (177.కి.మీ) రైల్వే లైన్‌కు విచిత్రంగా 1000 మాత్రమే కేటాయించింది.
అలాగే ముంబైకి ఒక్క కొత్త రైలు కూడా కేటాయించలేదు. కరీంనగర్ – తిరుపతి బై వీక్లీ సర్వీసులు పెంచలేదు. రాజధానికి ఎలాంటి కొత్త రైలు ప్రకటన లేదు. రామగుండం – మణుగూరు (200.కిమీ) రైల్వేలైన్‌కు 5 కోట్లు కేటాయించింది. దీని మొత్తం అంచనా విలువ 3900 కోట్లు కాగా, ఇలా 5 కోట్ల చొప్పున కేటాయిస్తే ఇది ఎప్పటికీ పూర్తవుతుందో బీజేపీ నాయకులే సమాధానం చెప్పాలని ప్రజానీకం స్పష్టం చేస్తున్నది.
ఆధునీకరణకు నిధులేవు.. వందేభారత్ ముచ్చటలేదు
దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్నది కరీంనగర్ రైల్వేస్టేషన్. గ్రానైట్, మక్కల ఎగుమతుల వంటి వాటితో గత కొన్నేండ్లుగా అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్నది. ఈ స్టేషన్ ఆధునీకరణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అంతేకాదు ఇక్కడి వ్యాపార, వాణిజ్య వర్గాలు కావాల్సిన సౌకర్యాల కల్పన కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు వినతులు చేస్తూనే ఉన్నారు. కానీ, ఒక్క పైసా కేటాయించలేదు. అలాగే వందేభారత్ రైలు సేవలు ఉమ్మడి జిల్లా వాసులకు త్వరలోనే అందుతాయని బండి సంజయ్ గతంలో ప్రకటించారు.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు సైతం వందే భారత్‌కు అనుగుణంగా ఈ రూట్లలో వేగాన్ని పెంచేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా ఇటీవల ప్రకటించారు. పెద్దపల్లి-కరీంనగర్ మధ్య 100 కిలోమీటర్ల స్పీడ్, కరీంనగర్-జగిత్యాల(లింగంపేట) మధ్య 90 కిలోమీటర్లు, జగిత్యాల-నిజామాబాద్ 100 కిలోమీటర్లు, మేడ్చల్ -మనోహరాబాద్ మధ్య 110 కిలోమీటర్ల స్పీడ్‌తో నడిపేలా రైల్వేలైన్లను ఆధునీకరించినట్లుగా ప్రకటించారు. తీరా బడ్జెట్లో చూస్తే ఇందుకు సంబంధించిన ముచ్చటే లేదు.
బండి ఏం చెబుతారో..
నిజానికి బడ్జెట్ తర్వాత దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి కేటాయింపులు, ఇతర వివరాలు తెలుపుతూ ఒక పింక్ బుక్లెట్ విడుదల చేస్తారు. కానీ, ఈ సారి అది బయటకు రాలేదు. అలాగే బడ్జెట్ పూర్తయిన తర్వాత ఆయా జిల్లాలు, పార్లమెంట్ నియోజకర్గాలకు జరిగిన కేటాయింపులకు సంబంధించి ఎంపీలు, తమ పరిధిలో వచ్చిన నిధుల వివరాలను మీడియాకు తెలుపుతారు.
కానీ, బడ్జెట్ పెట్టి రోజులు గడుస్తున్నా అత్యంత ప్రాధాన్యత గల రైల్వే కేటాయింపుల విషయాన్ని మాత్రం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి గానీ, ఆ పార్టీ అనుచరులుగా ప్రకటించలేదు. దీనిని బట్టి చూస్తే ఈ వివరాలన్ని తెలిసే వారు ప్రకటించలేదని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలకు బండి ఏం సమాధానం చెబుతారో చూడాలని, లేదా కేంద్ర మంత్రులతో మాట్లాడి.. మళ్లీ ఏమైనా అదనపు నిధులు తెస్తారా..? అన్నది వేచి చూడాల్సి ఉందని చర్చించుకుంటున్నారు.