కలెక్టరేట్, మార్చి 25 : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద మంజూరైన అంతర్గత రహదారుల నిర్మాణ పనులు ఇప్పటికి ప్రారంభించలేదు. ఆర్ధిక సంవత్సరం ముగింపునకు మరో ఆరు రోజులు మాత్రమే గడువు మాత్రమే ఉండటంతో, పనులు ప్రారంభించటంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో కేటాయించిన నిధులు వెనక్కువెళ్లే అవకాశాలుండగా, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాకాలంలో గ్రామాల్లోని అంతర్గత రోడ్లపై నడవటంలో ప్రజలు పడే వేదన అంతా ఇంతా కాదు. సరైన డ్రైనేజీలు లేక మురుగు నిలిచి దోమల కారణంగా అనేక రోగాల బారిన పడుతుండటం సర్వ సాధారణం.
ఈ పరిస్థితుల్లో ఎన్ఆర్జీఎస్ ద్వారా సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెవాసుల ఇబ్బందులు తొలగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, గతేడాది నుంచి గ్రామాల అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారడంతో జిల్లాలోని గ్రామీణులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే జిల్లాలో ఎన్ఆర్జీఎస్ కింద మంజూరైన సీసీ రోడ్ల పనులు ప్రారంభించకపోవటమేననే వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఈ ఆర్ధిక సంవత్సరంలో 825 సీసీ రోడ్లు మంజూరు కాగా, వీటికి రూ.55కోట్లు కేటాయించారు. వీటిని ఈనెల 31 లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 625 పనులు మాత్రమే మొదలు పెట్టారు. వీటిలో 364 పనులు పూర్తయ్యాయి. ఇంకా 261 పనులు కొనసాగుతున్నాయి.
మరో 200 రోడ్డు పనులు ఇప్పటికీ మొదలే పెట్టలేదు. గ్రామాల్లో చేపట్టే అంతర్గత రహదారులు, భవనాల నిర్మాణ పనులు సాధారణంగా వేసవికి ముందే ప్రారంభిస్తారు. ఇంకా మిగిలిపోతే ఆర్థిక సంవత్సరం ముగింపులో వాటికి అనుమతులు మంజూరు చేస్తారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులు గుత్తేదారులు హాట్ కేకులుగా భావిస్తారు. వాటి నిర్మాణ పనుల కోసం పోటీ పడతారు. అయితే గత ఏడాది నుంచి మాత్రం గుత్తేదారులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఉపాధి నిధులతో చేపట్టే పనులకు బిల్లులు సకాలంలో రాకపోవడం, అడ్డగోలుగా మామూళ్లు ఇవ్వాల్సి రావటంతో పాటు, చేపట్టిన పనులకు జీఎస్టీ, గ్రామాల్లోని చిన్నాచితక నాయకులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోందని, దాంతో తమకు అప్పులే మిగులుతున్నాయని బహిరంగంగా విమర్శిస్తున్నారు.
అప్పులు తెచ్చిపెడితే తమకు మిగిలేది ఏమీ లేదంటూ పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. అలాగే, జరుగుతున్న పనులపై కూడా క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవటంతో, వాటి నాణ్యతను ప్రజలు శంకిస్తుండగా, మొదలుపెట్టని పనుల గురించి అసలు పట్టించుకోవడమే లేదని మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యమని పదే పదే ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వ నేతలు, ఆచరణలో శ్రద్ధ చూపకపోవటంతోనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై డీఆర్డీవో శ్రీధర్ మాట్లాడుతూ..ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. వందశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ నాణ్యత లోపం లేకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.