Election manifesto | ధర్మారం, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాకముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్, దివ్యాంగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు . ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ ఆదేశాల మేరకు సంఘ నాయకులతో పాటు దివ్యాంగుల సంఘం నాయకులు సోమవారం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు .
ఇదివరకు ఉన్న వృద్ధుల పింఛన్లు రూ.2వేల నుంచి రూ.4వేలు, దివ్యాంగుల పింఛన్లు రూ.4వేల నుండి రూ.6వేలకు, కండ క్షీణత ఉన్నవారికి రూ. 15వేలు పెన్షన్ ఇవ్వాలని వారు తాసిల్దార్ కు సమర్పించిన వినతి పత్రంలో డిమాండ్ చేశారు. అలాగే ఇదివరకు గత ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం పింఛన్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మద్దునాల మల్లేశం, దివ్యాంగుల మండల అధ్యక్షుడు గుమ్మడి రమేష్, మండల ఉపాధ్యక్షుడు దారవేని అంజయ్య , ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి సాతరాజు ల సుమన్, దివ్యాంగుల మండల గౌరవ అధ్యక్షుడు ఎనగంటి గంగయ్య, సభ్యులు జాడి స్వామి, దీకొండ సంధ్య, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు కాంపల్లి చంద్రశేఖర్, నెరువట్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.