Pending scholarships | కోరుట్ల, సెప్టెంబర్ 8: ప్రభుత్వం గత మూడేళ్లుగా బకాయి పడ్డ విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులతో పాటూ కళాశాలలకు చెందిన ఫీజు రీయంబర్స్మెంట్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని పట్టణంలోని శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సీటీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల జిల్లా అధ్యక్షుడు పోతని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక పాత బస్టాండులోని కళాశాల నుంచి జాతీయ రహదారి మీదుగా కొత్త బస్టాండు వరకు ర్యాలీ తీశారు.
ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మూడు సంవత్సరాలుగా ఫీజుల రీయంబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయకపోవడం ఆన్యాయమని, విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా కళాశాలలను యాజమాన్యాలు ఏ విధంగా నడుపుతారని ప్రశ్నించారు. ఫీజులు చెల్లించాలని పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశామని, సచివాలయంలో సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేదని వాపోయారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.