మెట్పల్లి, మే24: ‘మేం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తామన్న కాంగ్రెస్ హామీ అటకెక్కింది. ఒకటో తేదీ కాదు కదా..! మూడు నెలలుగా జీతాలు అందని పరిస్థితి మార్కెటింగ్ శాఖలో నెలకొన్నది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులూ వేతనాల కోసం నెలల తరబడిగా వేచి చూస్తున్నారు.
రోజు వారీ ఖర్చులు, ఇతరాత్ర అవసరాలకు సంబంధించి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరే కాదు ఈ శాఖలో పనిచేసి విరమణ పొందిన పలువురు పెన్షన్దారులదీ మూడు నెలలుగా ఇదే పరిస్థితి. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని, ఒకటో తేదీనే వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నారు.