కొత్తపల్లి, సెప్టెంబర్ 26 : ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ఇప్పించాలని, పాత పెన్షన్ విధానం అమలుచేయాలని టీఎన్జీవోస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఇప్పటికే రెండు పీఆర్సీలు నష్టపోయారని, న్యాయం జరిగేలా చూడాలని, జూలై ఒక టో నుంచి పీఆర్సీని అమలు చేసి మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోల సంఘ భవనంలో గురువారం సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించి, పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
ఒకటో తేదీన జీతం ఇవ్వడంపై ముఖ్యమంత్రికి ఉద్యోగుల పక్షాన శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉద్యోగులు ఎదురొంటున్న సరెండర్‌లీవ్, మెడికల్ రీయింబర్స్మెంట్, పిల్లల పెళ్లిలకని విత్ డ్రా చేసుకున్న జీపీఎఫ్ ఖాతాలోని డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ ఉద్యోగులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టేలా ప్రభుత్వం అడుగులు వేయాలని కోరారు.
ప్రభుత్వం జీవో నెంబర్ 79 విడుదల చేసిన క్రమంలో కలెక్టర్ యుద్ధప్రతిపాదికన కారుణ్య నియామకాలు చేపట్టి వా రి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వోద్యోగుల భాగస్వామ్యంతో నగదు రహిత వైద్యం అందించేలా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కుబేర్ ద్వారా కాకుండా పాత పద్ధతి ద్వారా జీతభత్యాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పంచాయతీలు, హెడ్డబ్ల్యూ, అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిషరించాలన్నారు. అలాగే అన్ని జిల్లాలోని యూనిట్లు, డిపార్ట్మెంట్ ఫో రం సభ్యత్వ నమోదు కార్యక్రమం, సర్వసభ్య సమావేశాలు చేపట్టి ఎన్నికలు నిర్వహించి సంఘాన్ని బలోపేతం కృషి చేయాలని సూచించారు.
పై సమస్యలపై టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిషరించాలని, లేదంటే కేంద్ర సంఘం ఇచ్చే పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి, సమస్యలు పరిషరించుకునే దిశగా ముందుకు సాగుతామన్నారు.
ఈ సమావేశంలో టీఎన్జీవోల కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, కోశాధికారి ముప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, మహిళా జేఏసీ చైర్మన్ ఇరుమళ్ల శారద, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మీందర్‌సింగ్, కార్యదర్శి వెలిచాల సుమంత్ రావు, రూరల్ అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, కార్యదర్శి నేరెళ్ల కిషన్, తిమ్మాపూర్ అధ్యక్షుడు పోలు కిషన్, కార్యదర్శి అంబటి నాగరాజు, చొప్పదండి అధ్యక్షుడు కామ సతీశ్, కార్యదర్శి లవ్‌కుమార్, హుజురాబాద్ అధ్యక్షులు చింతల సందీప్, జమ్మికుంట అద్యక్షులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.