మంథని, ఆగస్టు 23: మంథని బిడ్డగా తనకు అవకాశమిస్తే రాబోయే ఐదేళ్లు ఎమ్మెల్యేగా కాకుండా సేవకుడిలా పనిచేస్తానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. ప్రస్తుత మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే ఏనాడూ కూడా ప్రజల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ రాక్షస పాలనను అంతంచేసి, ప్రజలను కడపులో పెట్టుకొని కాపాడే బీఆర్ఎస్ పాలనను తెస్తామని స్పష్టం చేశారు. రాబోయే వంద రోజులు విజయం కోసం పని చేయాలని, కేసీఆర్‌ను మరోసారి సీఎంగా చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటించిన అనంతరం మొదటిసారి నియోజకవర్గ కేంద్రమైన మంథనికి ఆయన రాగా, బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గాన్ని 40 ఏండ్ల పాటు ఒకే కుటుంబం పాలించినా.. ఇక్కడ జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. తండ్రీ, కొడుకులిద్దరు ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎన్నడూ పట్టించుకోలేదని, కనీసం చెంచడు నీళ్లు కూడా పోయలేదని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లను నమ్మితో మోసపోతామని హెచ్చరించారు. తనకు అవకాశమిస్తే ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటాన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసి చదువుకోడానికి కృషి చేశానని, పేద బిడ్డలకు పెండ్లిళ్లు చేశానని, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నానని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో సేవ చేశానని గుర్తు చేశారు. కానీ, బీసీ బిడ్డగా ఎదుగుతున్న తనపై కాంగ్రెస్ నాయకులు అనేక కుట్రలు చేస్తున్నారని వాపోయారు.
ఇటీవల, గతంలో సోషల్ మీడియాలో విడుదల చేసిన రికార్డులతోపాటు ఇప్పటివరకు తన పై వచ్చిన ఆరోపణల్లో ఏ ఒక్కదాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు నిజం చేయలేకపోయారన్నారు. తనకు బీఆర్ఎస్ టికె ట్ రాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన నాయకులు కలిసిపోయి ముత్తారంలో ప్రెస్ మీట్ పెట్టడం చీకటి కుట్రను చూపిస్తుందన్నారు. ఇది కాంగ్రెస్ కుటీల రాజకీయానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో ఎవరికీ కూడా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకుండా అనేక కుట్రలు చేసిందన్నారు. కానీ తాను వాటన్నింటిని చేధించుకుంటూ వచ్చానని వివరించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గంలో నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఏకైక వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. తన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి చెందిన మట్టి బిడ్డనే ఎమ్మెల్యేగా చేస్తాను తప్పా తన కొడుకు, బిడ్డను ఎమ్మెల్యేగా చేయనన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలో ఎక్కడైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని బలంగా వినిపిస్తున్నదన్నారు. మనం అధికారంలో రావలంటే రానున్న వంద రోజులు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నియోజకవర్గ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లో ఉచితంగా హాస్టల్ సౌకర్యాన్ని కల్పిస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణీరాకేశ్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, పీఏసీఎంస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ఎక్కటి అనంతరెడ్డి, నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, ఆకుల కిరణ్, వీకే. రవి, శ్రీపతి బానయ్య, సముద్రాల శ్రీనివాస్, గర్రెపల్లి సత్యనారాయణ, కుర్ర లింగయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.