మెట్పల్లి, సెప్టెంబర్ 8: ఇటీవల పెద్దాపూర్ గురుకుల విద్యాలయంలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగమే దిక్కుకాబోతున్నది. పర్మినెంట్ ఉద్యోగం అనేది తమ ప్రొవిజన్లో లేదు.. కాంట్రాక్ట్ ఉద్యోగం ఇయ్యలేం, అవుట్ సోర్సింగ్ విధానంలో అటెండర్ లేదా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి నియామకంపత్రం అందిస్తున్నాం.. అంటూ ప్రభుత్వం తరపున అధికారులు స్పష్టం చేశారు.
ఈ మేరకు మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని ఆరపేటకు చెందిన విద్యార్థి గణాధిత్య తండ్రి మహేశ్‌కు వచ్చే ఏడాది ఏప్రిల్ 24వరకు అటెండర్ ఉద్యోగం ఖరారుచేశారు. అనిరుధ్ కుటుంబంలో ఒకరికి ఇంకా ఉద్యోగం ఖరారుకానట్లు తెలిసింది. బాధిత కుటుంబాలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని, ఎక్స్‌గ్రేషియా అందిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు.
తేల్చని పోస్టుమార్టం
గుణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలు ఇంకా స్పష్టం కావడంలేదు. సుమారు 45 రోజులు కావస్తున్నా.. పోస్టుమార్టం నివేదికలు బయటకు రాకపోవడం, ఒక వేళ వచ్చిన సంబంధిత అధికారులు కావాలనే కప్పి పుచ్చుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమగ్ర విచారణేది?
గుణాధిత్య, అనిరుధ్ అస్వస్థతకు గురైనప్పుడు సకాలంలో కేర్‌టేకర్, సంబంధిత అధికారి స్పందించి హుటాహుటిన దవాఖానకు తరలించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. విద్యార్థుల మృతికి కారణాలు ఏమిటి.. బాధ్యులు ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. కనీసం విచారణ కూడా సమగ్రంగా జరగడం లేదు. గుణాధిత్య మృతితో ప్రిన్సిపాల్ విద్యాసాగర్‌ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. అనిరుధ్ మృతికి బాధ్యులు ఎవరు.. తీసుకున్న చర్యలు ఏమిటి అనేది ప్రశ్నార్థకం.