మంథని రూరల్, డిసెంబర్1: పెద్దపల్లి జిల్లా మంథని(Manthani) మండలంలోని గుంజపడుగు గ్రామంలో గల వైన్‌షాపు (Wine shop)వివాదాల కారణంగా ప్రారంభోత్సవం నిలిచింది. ప్రభుత్వం నూతన మధ్యం షాపులకు టెండర్లు పిలవడంతో సుమారుగా 38 మంది గ్రూపుగా కలసి వైన్ షాప్స్‌కు టెండర్లు వేశారు. టెండర్లు వేసే క్రమంలో గ్రూప్ సభ్యులంతా అగ్రిమెంట్ రాసుకున్నారు. ఎవరి పేరు పైన షాపు వచ్చిన అందరు కలసి షాప్‌ను నిర్వహించుకునే విధంగా అగ్రిమెంట్ రాసుకున్నారు. లక్కీ డ్రాలో గ్రూప్ సభ్యురాలైన భారతికి డ్రాలో షాప్ వచ్చింది.
ఈ క్రమంలో అందరు ముందుగా అనుకున్న దాని ప్రకారం నడవాల్సి ఉండగా షాప్ వచ్చిన సదరు మహిళ అగ్రిమెంట్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో సభ్యులంతా షాపు ఎదుట నిరసనకు దిగి ఆందోళన చేశారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న మంథని ఎస్ఐ సాగర్, ఎక్సైజ్ ఎస్ఐ సాయికుమార్ అందోళన కారులతో మాట్లాడారు. కానీ షాప్ యజమాని ఎంతకు అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్లకపోవడంతో షాప్‌కు వచ్చిన లిక్కర్ మాల్‌ను బయటే వాహనంలో నిలిపి ఉంచారు. సమస్యను పరిష్కరించేంత వరకు షాప్ ఓపెనింగ్‌ను అడ్డుకుంటామని 37 మంది గ్రూప్ సభ్యులు తెలిపారు.
చిన్న చిన్న పనులు చేసుకొని జీవించే తాము అంతా కలిసి తలోకొంత డబ్బులు వేసుకొని వైన్ షాప్‌లకు టెండర్లు వేస్తే తీరా డ్రాలో వచ్చిన తరువాత అగ్రిమెంట్ ప్రకారం కాకుండా తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తుండటంతో సభ్యులంతా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు. కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు బత్తిని శ్రీనివాస్, నర్సింహారెడ్డి, మల్లేష్, సురేందర్ రెడ్డి, కూర శ్రీనివాస్, శ్రీనివాస్‌తో పాటు పెద్ద ఎత్తున సభ్యులు ఉన్నారు.