పెద్దపల్లి రూరల్ జూలై 30 : గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షం కారణంగా పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామం అనుబంధ గ్రామం గట్టుసింగారం గౌరీ గుండాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. భారీ వర్షంతో జలపాతం వద్ద నీటి ఉధృతి రికార్డు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో సందర్శకుల భద్రతను దృష్టిలో జలపాత సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జలపాతం వెళ్లే ప్రదాన రహదారికి అడ్డంగా ప్రమాద హెచ్చరికల బోర్డులు, హోర్డింగ్ లు పెట్టి సందర్శకుల రాకపోకలను నిషేదిస్తున్నారు.
పర్యాటకులు ఎవరూ జలపాతం వద్దకు వెళ్లకూడదని, పోలీసులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని సూచించారు. వర్షాల ధాటికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. స్థానిక సర్పంచ్ నూనెసరోజన రమేష్ , పంచాయతీ కార్యదర్శి ఎండీ అఫ్జల్ పాషా, జీపీవో శ్రావణ్ , ఉపాధిహామి ఫీల్డ్ అసిస్టెంట్ ఇండ్ల రమేష్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.