IndiGo Charges : దేశీయ విమానయాన రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఇండిగో (IndiGo).. ప్రయాణికులపై అదనపు భారాన్ని మోపనుంది. విమాన ఇంధనం (ATF) ధరలు భారీగా పెరగడంతో ఫ్యూయల్ సర్‌చార్జీల (Fuel Surcharges) ను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ నూతన ఛార్జీలు అక్టోబర్ 6 నుంచి చేసే అన్ని కొత్త బుకింగ్‌లకు వర్తిస్తాయని సంస్థ స్పష్టంచేసింది.
గత కొన్ని నెలలుగా ఏటీఎఫ్ ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయని, గత నెలతో పోలిస్తే తాజాగా 14 శాతానికిపైగా ధర పెరిగిందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన దశాబ్దకాలంలో ఇదే అత్యధికమని పేర్కొన్నది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చులే కీలకమని, ఈ పెరుగుదల తమ సంస్థతోపాటు మొత్తం ఏవియేషన్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది.
నూతన ఛార్జీల ప్రకారం.. దేశీయ మార్గాల్లో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారిపై రూ.375.. 501 నుంచి 1,000 కిలోమీటర్ల వరకు రూ.600 సర్ చార్జీ వసూలు చేయనున్నారు. అదేవిధంగా 1,001-1,500 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.900, 1,501-2,000 కిలోమీటర్ల దూరానికి రూ.1,150… 2,000 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు రూ.1,300 చొప్పున ఫ్యూయల్ సర్‌చార్జ్ వర్తిస్తుంది.
ఇక అంతర్జాతీయంగా సార్క్ దేశాలకు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు.. సౌత్ ఈస్ట్ ఆసియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలకు రూ.5,500.. ఆఫ్రికా, యూరప్ దేశాలకు రూ.6,000 ఫ్యూయల్ ఛార్జ్‌ను నిర్ణయించారు. వాస్తవానికి పెరిగిన ఇంధన వ్యయాన్ని భర్తీ చేయడానికి ఇంకా అధిక మొత్తంలో ఛార్జీలు పెంచాల్సి ఉన్నప్పటికీ, ప్రయాణికులపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతోనే పరిమితంగా సర్దుబాటు చేసినట్లు ఇండిగో వెల్లడించింది.