న్యూఢిల్లీ: కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం (ఈసీ) వినియోగించే ‘ఫారం 6’లో ఎలాంటి సవరణలకు తాము ఆమోదం తెలుపలేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. అయితే ఈ మార్పులు ఎవరు చేశారో నిర్ధారించేందుకు సంబంధిత రికార్డులను తాము పరిశీలిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్ తెలిపారు. (Modified Form 6) సవరించిన ఫారం 6కు తాము ఆమోదం తెలుపలేదని, ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామని ఆయన చెప్పారు. ‘ఆ రికార్డులను సుప్రీంకోర్టుకు సమర్పించినప్పుడు ‘ఫారం 6’లో ఎవరు మార్పులు చేశారో మేము చూడాలనుకుంటున్నాం’ అని ఆయన అన్నారు.
కాగా, మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఏకాభిప్రాయం లేకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)
జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమకు స్పందన అందేంత వరకు ఈసీ నిర్ణయాలు చట్టానికి అనుగుణంగానే ఉన్నాయని తాము భావిస్తామని ధర్మాసనం పేర్కొంది. ‘ఆ నివేదిక కచ్చితమైనది కావచ్చు, కాకపోవచ్చు. కానీ దాని ఆధారంగా మేము ఉత్తర్వులు జారీ చేయలేం. మేము వారి స్పందన కోసం వేచి ఉండాలి’ అని సీజేఐ సూర్య కాంత్ పేర్కొన్నారు.
మరోవైపు ‘ఫారం 6’ అనేది ‘ఓటర్ల నమోదు నియమావళి 1960’లో ఒక భాగం. దీనిని కేవలం ఒక సవరణ ద్వారా మాత్రమే మార్చడం సాధ్యమవుతుంది. అయితే ‘ఫారం 6’కు ఒక అనుబంధ పత్రం జతచేయాలని 2025లో ఈసీ పేర్కొంది. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ (సర్)లో భాగంగా కొత్త ఓటర్లు తమ తల్లిదండ్రులు లేదా తాత, నానమ్మలు లేదా తాత, అమ్మమ్మల గత ఓటర్ల జాబితాలతో అనుసంధానించే వివరాలను అందించాలని కోరడం వివాదస్పదమైంది.
అయితే తమకు తెలియకుండా లేదా తమ సిఫార్సు లేకుండా ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (సర్), ‘ఫారం 6’ సవరణకు సంబంధించి సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఉత్తర్వులు జారీ చేశారంటూ ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఆరోపించినట్లు సెప్టెంబర్ 25న ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఆ ఇద్దరు ఎన్నికల కమిషర్లు గత 10 నెలల్లో కనీసం 14 సార్లు రికార్డుల్లో తమ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ‘సర్’ ప్రక్రియపై వివాదం తారాస్థాయికి చేరింది.
కాగా, సెప్టెంబర్ 28న ఈ వివాదంపై ఈసీ స్పందించింది. ‘ఫారం 6’ సవరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. అలాగే జతచేయాల్సిన డిక్లరేషన్ను కూడా సుప్రీంకోర్టు సమర్థించినట్లు ఈసీ వెల్లడించింది. అయితే ‘ఫారం 6’లో ఎలాంటి సవరణలకు తాము ఆమోదం తెలుపలేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ మార్పులు ఎవరు చేశారో నిర్ధారించేందుకు సంబంధిత రికార్డులను తాము పరిశీలిస్తామని సీజేఐ సూర్య కాంత్ పేర్కొన్నారు.