పెద్దపల్లి రూరల్, జూన్ 27: హాస్పిటల్లో చికిత్సపొందుతున్న మిత్రుడిని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన పెద్దపల్లి (Peddapalli) మండలం అప్పన్నపేట శివారులో గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనతో మిత్రుల మూడు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన చక్రి, శ్యామ్లు పెద్దపల్లికి చెందిన మిత్రుడు ఇటీవల ప్రమాదానికి గురికాగా పరామర్శించి వెళ్లేందుకు వచ్చి తిరిగి గోదావరిఖనికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో వారి బైక్ను పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట శివారులో గల పెట్రోల్ పంపు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం చేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులను చక్రి(25), శ్యామ్ (24) గా గుర్తించారు. మృతదేహాలను పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలోని మార్చురీకీ తరలించామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పెద్దపల్లి రూరల్ ఎస్ఐ బీ. మల్లేష్ తెలిపారు. మృతుడు చక్రికీ భార్యతో పాటు ఏడాదిన్నర కూతురు ఉన్నారు.