పెద్దపల్లి : మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు నియోజకర్గంలోని నాగెపల్లి గ్రామస్తులు చుక్కలు చూపించారు. నాగెపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ఆ గ్రామానికి చెందిన శ్రీనివాస్, రాజయ్యతో పలువురు అభివృద్ధిపై నిలదీయడం అభినందనీయం. ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యేకు ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పాలని పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు సూచించారు.
సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగేపల్లి వాసులకు వచ్చిన మార్పు, ధైర్యం అందరిలో రావాలన్నారు. కాగా, నాగేపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును మా ఓట్లతో గెలిచి, మా గ్రామానికి ఏం చేశారు అంటూ ప్రశ్నిస్తే.. దానికి ఎమ్మెల్యే ప్రభుత్వం మనది కాదు అని సమాధానం ఇచ్చారు. దీంతో మాకు కేవలం ఒక నియోజకవర్గంలో మాత్రమే ఓటు వేసే హక్కు ఉందని.. 119 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోలేము కదా సార్ అని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే దిక్కు తోచక అక్కడ నుంచి జారుకున్నారు.