పెద్దపల్లి : మట్టిలో మాణిక్యం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో జరిగిన విధ్వంసాలను నిరసిస్తూ గురువారం మంథని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కోనసీమ సంఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తికే అవమానమన్నారు. కోనసీమలో జరిగిన మూర్ఖపు చర్యకు నిరసనగా దీక్ష చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 76 ఏండ్ల తర్వాత కూడా దేశంలో ఇలాంటి దుస్థితి నెలకొన్నందుకు ప్రజాస్వామ్యవాదులంతా తలదించుకునే పరిస్థితులు ఏర్పడటం బాధాకరమన్నారు.
మహనీయుడు అంబేద్కర్ను ఒక వర్గానికి అంటగట్టి ఇంత అవమానకరంగా చేస్తున్న చర్యలను మేధావులు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఎస్సీలకు మాత్రమే పరిమితం కాదని చెప్పడంలో అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు విఫలం అవుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ జీవితచరిత్రను చెప్పకపోవడంలో దేశం మనకు మనం ఆత్మహత్యాసదృశ్యంగా భావించాలని ఆయన అన్నారు.
ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ మా దేశం వాడైతే బాగుండని ఆలోచిస్తున్న తరుణంలో దేశానికి గర్వకారణమని చెప్పుకోకపోవడానికి కారణం ఎవరో మేధావులు అలోచించాలి. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేసి అన్ని పాఠశాలలు, లైబ్రరీలో అంబేద్కర్ చరిత్రను పెట్టాలన్నారు.
అలాగే ప్రతి రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆ మహనీయుడి పేరు పెట్టాలని, దేశమంతా ఇదే తరహా అడుగులు వేయాలన్నారు. అంబేద్కర్ను అవమానించి పైశాచిక ఆనందం పొందిన వారికి జ్ఞానోదం కలిగే విధంగా గ్రామగ్రామన ఆయన చరిత్ర చెప్పటానికి కార్యచరణ మొదలుపెడుతున్నామన్నారు.
దీనిని మంథని నియోజకవర్గం నుంచే ఆరంభిస్తామని చెప్పారు. అంబేద్కర్ జీవితచరిత్ర గురించి నియోజకవర్గంలో చాటిచెప్పే కార్యక్రమం కొనసాగుతుందని, జిల్లాలో కూడా కొనసాగేలా ఆలోచన చేస్తామన్నారు. కోనసీమ ఘటనను దేశ ప్రజలు ఖండించాలన్నారు. అనంతరం మంథని ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాబిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.