ఓదెల, జులై 15 : పెద్దపల్లి జిల్లా కొలనూరు రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని సికింద్రాబాద్ రైల్వే నిలయంలో ఏడీఆర్ఎం సంజీవరావుకు డివిజనల్ రైల్వే బోర్డు మెంబర్ అనుమాస శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. అలాగే కొలనూరు స్టేషన్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. నిత్యం ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాంలకు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ప్రయాణిస్తున్నారని తెలిపారు.
కొలనూరులో ఫ్లాట్ ఫామ్ లపై షెడ్స్ లేని కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే తాగునీటి సౌకర్యం కూడా కల్పించాలన్నారు. కాజీపేట నుండి బల్లార్ష వెళుతున్న అజిని, సికింద్రాబాద్ కాగజ్నగర్ ఎక్స్ ప్రెస్, తిరుపతి నిజాంబాద్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైళ్లను కొలనూరు రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయాలని కోరారు. కొలనూర్ రైల్వే స్టేషన్లో సదుపాయాలు కల్పించడానికి ఏడీఆర్ఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే పెద్దపెల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు శ్రీనివాస్ తెలిపారు.