Peddapalli | ధర్మారం, ఏప్రిల్ 25: జన గణన 2026 మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు చేపట్టనున్న నేపథ్యంలో పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మేము సైతం అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో జన గణన చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమంతట తాము వివరాలు నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రచ్చపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు సెలవులు ఉన్నప్పటికీ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చారు. గత 3 రోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికీ తిరుగుతూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఆన్లైన్లో 34 ప్రశ్నలతో కూడిన ఇంటి వివరాల ఫారమ్ పూర్తి చేయాలి. సబ్ మిట్ చేసిన తర్వాత ఒక ప్రత్యేక కోడ్ వస్తుంది. మే 11 తర్వాత మీ బ్లాక్‌కు వచ్చే ఎన్యుమరేటర్‌కు ఈ కోడ్ ఇస్తే ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఇట్టి విషయాల గురించి విద్యార్థులు ఇంటింటా తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జన గణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ప్రజలందరూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ సదుపాయాన్ని వినియోగించుకొని డిజిటల్ జన గణనకు సహకరించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలోనూ ఈ పాఠశాల విద్యార్థులు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఓటు వేసే విధానం పైన గ్రామంలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించటం వల్ల చెల్లని ఓట్ల శాతం గణనీయంగా తగ్గిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీ మోహనా చార్యులు తెలిపారు.