కోల్ సిటీ, మార్చి 4: రామగుండంలో డీజేలు మార్మోగాయి. హోలీ వేడుకల హడావిడిలో పడి నిషేధాజ్ఞలు ఉన్నాయన్నదే మరిచిపోయారు. చిన్నారులు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసంకు భంగం కలగకుండా శబ్ద కాలుష్యంను నివారించడంలో భాగంగా డీజే సౌండ్స్ వినియోగంపై నిషేధం విధించినట్లు ఈనెల 1వ తేదీన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రకటన జారీ చేసిన విషయం విధితమే. ఏప్రిల్ 1వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 223, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెండు రోజులుగా జరిగిన హోలీ వేడుకల్లో యథేచ్చగా డీజేలు మోగడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిలో భాగంగా బుధవారం గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ ఏరియాలో పలువురు వ్యాపారులు నడి రోడ్డుపైనే డీజే శబ్దాలతో చిందులు వేశారు. బడా వ్యాపారులకు నిషేధాజ్ఞలు వర్తించవా? అంటూ పలువురు బాహాటంగానే విమర్శలు గుప్పించారు.
ప్రధాన రోడ్డుపై డీజే సౌండ్స్ తో గంటల తరబడి నృత్యాలు చేస్తూ పలువురి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే స్థానిక ప్రధాన చౌరస్తాలో జరిగిన హోలీ వేడుకల్లో సైతం డీజే సౌండ్స్ వినియోగించడం పట్ల కూడా విమర్శలు వచ్చాయి. ఐతే హోలీ వేడుకల్లో నిషేధాజ్ఞలు మినహాయించారా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రామగుండం బల్దియా ఆధ్వర్యంలో..
కాగా రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర పాలక మేయర్ మహంకాళి స్వామి ముఖ్యతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.