Peddapalli | పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి జిల్లాలోని నిట్టూరు జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడు లింగమల్ల శంకర్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అతను విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. జైమ్ అనాలని హుకుం జారీ చేశాడు. అంతటితో ఆగకుండా రాత్రిపూట విద్యార్థుల దగ్గరకు వెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు కూడా చేయించుకున్నారు. దీంతో అసహనానికి గురైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్ ఎదుట బైఠాయించి.. శంకర్ సార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆందోళన సంగతి తెలియగానే ఎస్సై లక్ష్మణ్‌రావు పాఠశాల వద్దకు వెళ్లారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నంచేశారు. చివరకు కలెక్టర్, డీఈవోలను పాఠశాలకు తీసుకురావాలని వారు చేసిన డిమాండ్‌ను ఒప్పుకోవడంతో వారు ఆందోళన విరమించారు. ఎస్సై ఇచ్చిన సమాచారంతో డీఈవో మాధవి నిట్టూరు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. ఘటనపై విచారణ చేపట్టి.. విద్యార్థుల నుంచి వివరాలను సేకరించారు. ఈ క్రమంలో లింగమల్ల శంకర్ చేస్తున్న అరాచకాలను డీఈవోకు విద్యార్థులు వివరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ లింగమల్ల శంకర్‌ను బడిలో నుంచి తీసేయాలని అప్పుడే బడికి వస్తామని విద్యార్థులు తెగేసి చెప్పారు.
ఇదిలా ఉంటే నిట్టూరు జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని కూడా తెలుస్తోంది. వారం రోజుల కిందట అదే పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులపై లింగమల్ల శంకర్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. సదరు ఉపాధ్యాయులు కూడా శంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలు పెట్టిన కేసులపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. అయితే ఆ కేసులకు సంబంధించిన వివరాలను మాత్రం చెప్పేందుకు ఎస్సై నిరాకరించారు.