సాయం అందక.. సాగు సాగక గుండె చెదిరిన రైతులకు బీఆర్ఎస్ దండు అండగా నిలుస్తున్నది. ఆత్మహత్యల బాట పడుతున్న అన్నదాతలకు.. చనిపోయి కాదు, బతికుండి కొట్లాడుదామని ధైర్యాన్ని నూరిపోస్తున్నది. మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి వచ్చిన రైతు ఆత్మహత్యల కమిటీ.. రైతు పిట్టల లింగన్న కుటుంబానికి భరోసానిచ్చింది. అనంతరం వందలాది మంది రైతులతో సమావేశమై, రైతన్నలూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకున్నది. మీరు అధైర్య పడొద్దని, మీకు అండగా రైతు బాంధవుడు కేసీఆర్ ఉన్నారని అభయమిచ్చింది.
జగిత్యాల, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ)/ ఇబ్రహీంపట్నం : అన్నదాతల బలవన్మరణాలు, సాగు సంక్షోభంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు అధినేత కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యులు మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి వచ్చారు. రైతు రుణమాఫీ కాలేదని ఆవేదన చెంది 20 రోజుల క్రితం పిట్టల లింగన్న అలియాస్ తోకల లింగన్న ఆత్మహత్య చేసుకోగా, ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న లింగన్న భార్య లక్ష్మిని చైర్మన్ నిరంజన్‌రెడ్డి, సభ్యులు పువ్వాడ అజయ్, సింగిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్యయాదవ్తోపాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ఓదార్చారు.
ఈ సమయంలో లింగన్న భార్య లక్ష్మి కంటికి నాలుధారలుగా ఏడ్వడాన్ని చూసి చలించిపోయారు. తల్లి కండ్ల నుంచి వస్తున్న నీళ్లను ఆమె ఏడేండ్ల బిడ్డ అమాయకంగా తన చిన్న చేతులతో తుడ్వడాన్ని చూసి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఆవేదన చెందారు. ధైర్యం కోల్పోవద్దని, బీఆర్ఎస్ పార్టీతోపాటు తామంతా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వచ్చాక పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు హామీ ఇచ్చారు. అలాగే, పిల్లల చదువులకు సాయం అందిస్తామని చెప్పారు.
అనంతరం అధ్యయన కమిటీ సభ్యులు స్థానికంగా ఉన్న వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో రైతులతో సమావేశమయ్యారు. కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలిరాగా, దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడుతూనే.. తామున్నామనే భరోసా కల్పించారు. పది మందికి అన్నం పెట్టి బతికించే రైతన్న ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి అందరికీ దుఃఖాన్ని కలిగిస్తున్నదని ఆవేదన చెందారు. తల్లుల కన్నీళ్లను బిడ్డలు తూడ్చే దుస్థితిని తీసుకొచ్చిన కాంగ్రెస్‌ను వదిలేది లేదని స్పష్టం చేశారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, మీకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అభయమిచ్చారు. కొట్లాడాలే తప్ప.. వెనక్కి పోవద్దని, పోరాటానికి సిద్ధం కావాలని, సర్కారును ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
అధ్యయన కమిటీ వస్తుందన్న సమాచారంతో కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఇబ్రహీంపట్నానికి తరలివచ్చారు. కమిటీ వెంట లింగన్న ఇంటికి వచ్చి ఆయన చిత్రపటానికి అంజలిఘటించారు. అనంతరం సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మోసాలు, పద మూడు నెలల పాలనలో రైతు పడుతున్న కష్టాలు, సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు హామీలను కమిటీ సభ్యులు వివరించిన సమయంలో రైతులు కొంత ఆగ్రహానికి లోనయ్యారు. కమిటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ రంగంపై ఉన్న విజన్‌ను విడమర్చిచెప్పడంతో రైతులు మంత్రముగ్ధులయ్యారు. రైతుబాంధవుడి పదేళ్ల పాలన గురించి చర్చించుకున్నారు.
రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన సమయంలో అందరూ జైకొట్టారు. సమావేశంలో నాయకులు, చెప్పిన విషయాలపై గ్రామాల్లో చర్చపెట్టేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సభలో పాట, మాటతో మంత్రముగ్ధులను చేశారు. ‘కమ్మరి కొలిమిలో దుమ్ములేసెను, పెద్దబాడిసె మొద్దుబారెను, సాలెల మగ్గం సనుగులు ఇరిగే’ అంటూ ఆయన పాడిన పాట సభలో గంభీరత్వాన్ని తెచ్చిపెట్టింది. ‘రైతు ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్యలే’ అంటూ సమావేశం తీర్మానం చేయాలని రసమయి వ్యాఖ్యానించిన సమయంలో, ఆయన మాటలకు రైతాంగం చప్పట్లతో మద్దతు తెలిపింది.