రైతుల్లో ధైర్యం నింపి కొట్లాడేందుకు సిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే రైతులను కలుస్తున్నాం. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నం. కేసీఆర్‌కు నివేదిక ఇస్తాం. ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టి సాధించుకుందాం. త్వరలోనే కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం వస్తుంది. ఆయన హయాంలో తెలంగాణ సేద్యరంగం ప్రపంచ వ్యవసాయ రంగానికే దిక్సూచిగా నిలుస్తుంది. రైతన్నలూ ధైర్యం కోల్పోవద్దు. ఆత్మహత్యలు చేసుకోవద్దు.
– అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి
జగిత్యాల, ఫిబ్రవరి 4, (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం/మెట్పల్లి రూరల్ : కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పాపాలే రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయని బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులెవరూ అధైర్య పడొద్దని, ఆత్మహత్యల బాట పట్టొద్దని, భవిష్యత్ మీదేనని ధైర్యం చెప్పారు. ప్రభుత్వంతో కొట్లాడి, దాని మెడలు వంచి సౌకర్యాలను సాధించుకుందామని పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ కాలేదని ఆవేదన చెంది 20 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన పిట్టల లింగన్న ఆత్మహత్య చేసుకోగా, అతని భార్య లక్ష్మి, కొడుకు, కూతురు, ఇతర కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం పరామర్శించారు. ఓదార్చారు.
అనంతరం స్థానికంగా ఉన్న వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రైతు సమస్యలే పునాది అని, తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ రైతు కేంద్రంగానే నిర్వహించిన విషయం ప్రతి రైతూ గుర్తు ఉంచుకోవాలన్నారు. 60 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసారంగం బాగుపడితే తెలంగాణ ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్న ఆలోచనతోనే ఉద్యమించి విజయం సాధించామన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో కేసీఆర్ కృషి చేశారని, రైతుల కోసం రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్, రైతుబీమా అమలు చేశారని చెప్పారు. సాగునీటి కోసం కాళేశ్వరం, పాలమూరు లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించారన్నారు. ఇలా పదేండ్లలో వ్యవసాయ రంగం వృద్ధిలోకి వచ్చిందన్నారు. అయితే, నేడు ఆ పరిస్థితులు దెబ్బతిన్నాయని, రైతులు మళ్లీ వలసలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ పదమూడు నెలల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 418 రైతులు ప్రాణాలు తీసుకున్నారని జరిగాయని, ప్రతి రోజూ రాష్ట్రంలో ఏదో ఒక్క చోట రైతు ఆత్మహత్య నమోదవుతూనే ఉందని, ఇది అత్యంత హృదయ విధారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నా.. లేకున్నా, రైతుల్లో మనోధైర్యాన్ని కల్పించి, వారిని ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల అధ్యయనం కోసం కేసీఆర్ అధ్యయన కమిటీని వేశారని తెలిపారు. కమిటీ తొలి రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి, నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సమయంలోనే మరో ఆరు రైతు ఆత్మహత్యలు జరిగినట్లు సమాచారం అందడం బాధాకరమన్నారు. రైతు లింగన్న భార్య లక్ష్మిని పరామర్శిస్తున్న సమయంలో ఆమె కళ్ల నుంచి వస్తున్న కన్నీటి ధారను ఆమె ఏడేళ్ల కూతురు తన చిన్న చేతులతో తుడుస్తున్న దృశ్యం అందరినీ కలిచి వేసిందని ఆవేదన చెందారు. తల్లుల కన్నీళ్లను బిడ్డలు తూడ్చే దుస్థితికి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదని హితవుపలికారు.
సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తురగ శ్రీధర్‌రెడ్డి, నేమూరి సత్యనారాయణ, జాజాల జగన్రావు, రవీంద్‌రెడ్డి, జేడీ సుమన్, చిన్నారెడ్డి, గడ్డం రామ్‌రెడ్డి, మారు సాయిరెడ్డి, అలిశెట్టి మోహన్, కంఠం రమేశ్, కందర్ ప్రతాప్, నోముల గంగాధర్, పోదుగంటి రాజేందర్, సున్నం సత్యం, తుకారం చిన్నరాజయ్య, శ్రీధర్, భూమేశ్, నాంపెల్లి రమేశ్, రవికాంత్‌రెడ్డి, గంగారెడ్డి, జిల్లాల పవన్, గన్న భరత్‌రెడ్డి, పుప్పాల నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, బీమా, కరెంట్ వంటి సౌకర్యాలతో తెలంగాణ కోనసీమలాగా మారిపోయింది. కానీ కాంగ్రెస్ పాలనలో తలకిందులవుతున్నది. రైతు లోకం తీవ్ర ఆవేదనతో ఉన్నది. రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజలకు, రైతులకు పూర్తిగా విశ్వాసం పోయింది. పదేండ్ల పాటు ఉన్న మంచిరోజులు పోయి, చెడ్డరోజులు దాపురించాయని కుమిలిపోతున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ చేసిన ద్రోహంతో భవిష్యత్తు సైతం చిందరవందరగా మారిపోయిందన్న ఆందోళనలో ఉన్నారు. రైతు భరోసా వేస్తామని చెప్పి, మండలానికి ఒక్క గ్రామాన్ని ఎంపిక చేయడంతోనే నమ్మకం కోల్పోయారు. మేధావులు, విద్యావంతులు సైతం ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
సీఎం రేవంత్‌రెడ్డి దగుల్బాజీ. రైతు లింగన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం. నా చిన్నతనంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తహసీల్ కట్టని రైతులతో బండలు ఎత్తించే ఘటనలు చూశా. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే రైతులకు మంచిరోజులు వచ్చాయి. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి రైతుల గోసపోసుకుంటున్నారు. రైతులు అధైర్యపడవద్దు. మళ్లీ మంచి రోజులు వస్తాయి. కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష.
– బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ మాజీ చైర్మన్
రైతుల ఆత్మహత్యలన్నీ రేవంత్‌రెడ్డి సర్కార్ చేసిన హత్యలే. సర్కార్‌పై హత్య కేసు నమోదు చేయాలి. రైతు ఎజెండాతోనే తెలంగాణ ఉద్యమం సాగింది. 14 ఏండ్ల పోరాటం తర్వాత రాష్ట్రం తెచ్చుకొని, తొలి సీఎం కేసీఆర్ సార్ నేతృత్వంలో బాగుపర్చుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ పూర్వపు రోజులు గుర్తుకు వస్తున్నాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి.
– రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే
ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలకు ప్రజలు మోసపోయారు. ఎంపీ ఎన్నికల సమయంలో దేవుడి పేరిట చేసిన గారడీ మాటలను నమ్మారు. రైతులకు కేసీఆర్ చేసినంత సేవ మరెవరూ చేయలేదు. కోరుట్ల నియోజకవర్గంలో ప్రజలు, రైతులు బీఆర్ఎస్ను విశ్వసించినా, కొన్ని చోట్ల జరిగిన తప్పిదాలతో ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు రైతు భరోసా రావడం లేదు. బీమా లేదు. కరెంట్ ఉండటం లేదు. వరికి బోనస్ వస్తలేదు. సర్కార్‌కు బుద్ధి రావాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలి. రైతు లింగన్న ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. పార్టీ తరఫున రూ.లక్ష సాయం అందిస్తాం. పిల్లల చదువులకు సాయం చేస్తాం.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు