ఓదెల, జూలై 12: పెద్దపల్లి జిల్లాలో ఓ కోతి.. బర్రెలతో స్నేహం సర్వత్రా చర్చకుదారితీసింది. ఇది పెద్దపల్లి మండలం కొత్తపల్లి- ఓదెల మండలం కొలనూర్ గ్రామాల ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నది. కొత్తపల్లి గ్రామానికి చెందిన చేగొండ మల్లయ్య బర్రెలను కాస్తుంటారు. అయితే ఏడాది క్రితం ఓ కోతి పిల్ల గ్రామంలో తప్పిపోయింది. దీంతో అది మల్లయ్య ఇంటి వద్ద ఉంటున్నది. అతడు రోజు తన బర్రెలను గ్రామ శివారు మైదాన ప్రాంతాలలో మేత కోసం తీసుకువెళ్తే.. ఆ కోతి కూడా బర్రెల వెంటే వెళ్తున్నది.
బర్రెల పైకి ఎక్కి ఎంచక్కా వెళ్తుండడాన్ని గమనిస్తున్న ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గ్రామంలోకి ఇతర కోతులు వచ్చినా వాటి వెంబడి వెళ్లకుండా ఆ బర్రెల వద్దనే రాత్రి పడుకుంటుందని కాపరి మల్లయ్య తెలిపారు. రోజూ దానికి అన్నం పెడుతున్నాని, తమ బర్రెలతో ఇక్కడే గడుపుతుందని వెల్లడించారు. ఈ స్నేహాన్ని చూసినవారు భలే భలేగా ఉందే అంటున్నారు.