పెద్దపల్లి, జనవరి 24(నమస్తే తెలంగాణ): సింగరేణిలో టెండర్ల ప్రక్రియలో సైట్ విజిట్ సర్టిఫికేట్ వివాదంతో పాటుగా వివిధ రకాల అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) శనివారం వెల్లడించిన అంశాలను టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి (Miriyala Raji Reddy) తప్పు పట్టారు. భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలు అత్యంత కీలకమైనవని, సాంకేతికమైనవని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పీఎస్యూఎస్ టెండర్లలో సాధారణంగా రెండు రకాల విధానాలు ఉంటాయని, కానీ మంత్రి ప్రెస్ మీట్లో కేవలం సర్టిఫికేట్ అవసరమయ్యే టెండర్లను మాత్రమే చూపించారని రాజిరెడ్డి విమర్శించారు.
డీమ్డ్ ప్రొవిజన్ అనేది బిడ్డర్ టెండర్ వేయడానికి ముందే క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారని భావించడం జరుగుతుందని రాజిరెడ్డి తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి బాధ్యత ఉండదని, రేపు ఏదైనా సమస్య వస్తే ‘మీరు చూసే టెండర్ వేశారు కదా‘ అని కాంట్రాక్టర్ ను ప్రశ్నించవచ్చని ఆయన అన్నారు. ‘సర్టిఫికేట్ నిబంధన అనేది అధికారులు స్వయంగా సంతకం చేసి ఇచ్చే సర్టిఫికేట్. ఇది ఒక రకమైన గేట్ కీపింగ్ లాంటిది. అధికారులు ఎవరికి సర్టిఫికేట్ ఇస్తే వారే టెండర్ వేయడానికి అర్హులవుతారు. వందలాది ఇతర కంపెనీలు సెల్ఫ్ డిక్లరేషన్ను అనుమతిస్తున్నప్పుడు, ఇక్కడ మాత్రమే సర్టిఫికేట్ అడగడంపై విమర్శలు వస్తున్నాయి. కోల్ ఇండియా(సీఐఎల్) నెయ్వేలీ(ఎన్ఎల్సీ) నమూనాను సరిగ్గా పరిశీలించాలి. దేశంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థలు పలు విధానాలను అనుసరిస్తున్నాయి. ఇందులో కోల్ ఇండియా లిమిటెడ్ సైట్ విజిట్ అనేది డీమ్డ్ ప్రొవిజన్ అంటే బిడ్డర్ తనంతట తానుగా చూసుకోవాలి. ప్రత్యేకంగా అధికారి సర్టిఫికేట్ అక్కర్లేదనే విషయాన్ని గ్రహించాలి. ఎన్ఎల్సీ(నయ్యేలీలైనైట్)లోనేమో సెల్ఫ్ డిక్లరేషన్ పద్ధతి ఉంటుంది. అంటే ‘నేను సైట్ చూశాను, అక్కడి పరిస్థితులు నాకు తెలుసు‘ అని బిడ్డర్ సంతకం చేసి ఇస్తే సరిపోతుంది.
సింగరేణి(ఎస్సీసీఎల్) కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థే అయినప్పటికీ, కేంద్ర సంస్థల కంటే భిన్నమైన నియమాన్ని పాటించడం ఇక్కడ చర్చనీయాంశమైంది సీఎంపీడీఐ నిబంధనలను 2025లో మార్చారు. కానీ డిప్యూటీ సీఎం భట్టి 2018, 2021 నాటి సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్ట్యూట్(సీఎంపీడీఐ) పత్రాలను ప్రస్తావించారు. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలేంటంటే.. నిబంధన వర్సెస్ అమలులో సీఎంపీడీఐ మార్గదర్శకాల్లో సైట్ విజిట్ గురించి ఉన్నప్పటికీ, కోల్ ఇండియా ఇప్పటికీ దానిని తప్పనిసరి సర్టిఫికేట్ రూపంలో అడగడం లేదు. 2018 నుండి ఆ నిబంధన ఉన్నట్లయితే, గతంలో లేని విధంగా కేవలం 2025లో(కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక) దీనిని కఠినంగా అమలు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా సింగరేణి టెండర్లలో ఈ నిబంధనను కొత్తగా చేర్చడం పోటీని తగ్గించడానికేననే అనుమానాలు కలుగుతున్నాయి. కొంత మంది ఎంపిక చేసిన వారికే దక్కే విధంగా సెలెక్టివ్ అప్రోచ్ ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో సర్టిఫికేట్ జారీ చేయడంలో వివక్ష చూపుతున్నారనేది అత్యంత తీవ్రమైన ఆరోపణ’ అని రాజిరెట్టి పేర్కొన్నారు.
ఒకవేళ 10 కంపెనీలు టెండర్ వేయాలనుకుంటే.. అధికారులు కేవలం 3 కంపెనీలకే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తే, మిగిలిన 7 కంపెనీలు ఆటోమేటిక్ గా పోటీ నుండి తప్పుకోవాల్సి వస్తుంది కదా అని రాజిరెడ్డి అన్నారు. ఇది పూర్తిగా పారదర్శకత లోపమేనని ఆయన విమర్శించారు. సర్టిఫికేట్ ఇవ్వడానికి నిర్దిష్టమైన కాలపరిమితి లేకపోవడం లేదా అధికారుల విచక్షణపై ఆధారపడటం వల్ల, అది కొందరికి మాత్రమే మేలు చేసే ‘సెలెక్టివ్ అప్రోచ్గా మారిపోయిందని విమర్శించారు. టెండర్ ప్రక్రియలో పోటీ ఎంత ఎక్కువగా ఉంటే, ప్రభుత్వానికి అంత తక్కువ ధరలో పని పూర్తవుతుందని, కానీ సైట్ విజిట్ సర్టిఫికేట్ వంటి నిబంధనలు ఎంట్రీ బారియర్స్గా మారి, పోటీని తగ్గించి ధరలను పెంచే అవకాశం ఉంటుందన్నారు. గతంలో ఎప్పుడూ సైట్ విజిటింగ్ నిబంధనలను కఠినంగా అమలు చేయకపోగా.. ఇప్పుడే ఇంత కఠినంగా అమలు చేయడంతోనే ఈ అవినీతి అక్రమాల ఆరోపణలు వస్తున్నాయనే విషయాన్ని మంత్రి, ప్రభుత్వం గుర్తించాని రాజిరెడ్డి సూచించారు.
మంత్రి ప్రెస్ మీట్లో మరి గత ప్రభుత్వాలు ఎందుకు సైట్ విజిటింగ్ విధానాన్ని అమలు చేయలేదో మంత్రి వెల్లడించాలని, ఇప్పుడు సైట్ విజిట్ విధానం వల్ల వారు ఎంపిక చేసిన వారికి మాత్రమే టెండర్ దక్కుతున్నదనేదే తమ ప్రధానమైన ఆరోపణ అని రాజిరెడ్డి వెల్లడించారు.