కోల్ సిటీ, సెప్టెంబర్ 8 : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి..ఇప్పుడు బీర్ల తయారీకి నోటిఫికేషన్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని వామపక్ష యువజన సంఘాల నాయకులు అన్నారు. ఈమేరకు స్థానిక భాస్కర్ రావు భవన్లో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల రమేశ్, డీవైఎస్ఈ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడారు.
నిరుద్యోగ యువత సమస్యలను ఆటకెక్కించి మైక్రో బ్రూవరీ నోటిఫికేషన్లు ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే యువత ఉద్యోగాలు లేక మద్యం, గంజాయి, మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటుంటే కొత్తగా బీర్ల తయారీకి నోటిఫికేషన్లు ఇవ్వడం యువతకు మరింత ప్రమాదం తలపెట్టడమేనన్నారు. తెలంగాణలో మద్యాన్ని ఏరులై పారించడంలో రేవంత్ ప్రభుత్వం ఉత్సాహంగా ఉందని ఎద్దేవా చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మైక్రో బ్రూవరీ ఏర్పాటు కోసం ఎక్సైజ్ శాఖ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే యువజన సంఘాలను కలుపుకొని ఎక్సైజ్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రామగుండం కార్పొరేషన్లో వందల సంఖ్యలో మద్యం బెల్టు షాపులు కొనసాగుతుంటే అవి చాలదన్నట్టుగా బీర్ల తయారీకి అనుమతులు ఇవ్వడం వల్ల మరింత అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించినట్లే అని విమర్శించారు. సమావేశంలో వామపక్ష సంఘాల నాయకులు ఆసాల నవీన్, రాణవేణి సుధీర్ కుమార్, కట్టా తేజేశ్వర్, సూర్య, పోతరాజు నాగరాజు తదితరులు ఉన్నారు.