సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 14: పెద్దపల్లి జిల్లా (Peddapalli) సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లిలో శ్రీ లక్ష్మీనములాద్రి స్వామి బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఘనంగా రథోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. రథోత్సవం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. స్వయంభూగా వెలసిన లక్ష్మీ నంబులాద్రి స్వామివారు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధిగాంచారు. మాఘశుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) సందర్భంగా ఈ నెల 8న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు వసతులు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ గజకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మునుపాల ప్రకాష్ రావు, ఆలయ చైర్మన్ అట్ల కుమార్, చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ మోహన్ రావు, మాజీ ఎంపీపీ బాలాజీ రావు, నాయకులు సాగర్ రావు, రాజా గౌడ్, సుధాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సతీష్, కుమార్‌తోపాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దేవునిపల్లిలో మూడు వేల ఏండ్ల క్రితం రెండు వందల మంది (నంబులు) అర్చకులు, ఆచార్యులు ఉండేవారని ప్రతీతి. వీరు భగవంతుని గొప్పతనం గురించి ప్రచారం చేసే వారు. అందుకే ఈ ప్రాంతాన్ని నంబు లాద్రిగా పిలుస్తున్నారు. నంబులాద్రిపై వెలసిన లక్ష్మీ నర్సింహస్వామి (నంబులాద్రి) ఆలయంలో ఆచార్యుల వైభవం కొనసాగుతున్నది. తిరుపతికి చెందిన వీరవెల్లి అరంగన హరప్పచార్యులు నంబులాద్రి గుట్టపై రామా నుజుల శిష్యుడు కూరేశుల విగ్రహన్ని ప్రతిష్టించారు. కూర్చుని ఉన్న ఈ విగ్రహంలో కుడి చేతిలో ఉపదేశ ముద్ర, ఎడమ చేతిలో భాష్య గ్రంధం ఉంటుంది. పెద్దపులి ఆలయంలో ప్రవేశించి కూరేశుల ఆచార్యుల విగ్ర హంపై దాడి చేసిందట. తెల్లవారి అర్చకులు వచ్చి చూడగా కూరేశుల పాదాల వద్ద పులి చనిపోయి ఉంది. కూరేశుల పొడవాటి గడ్డంపై పులి గోటితో గీసిన నిలువు గీతలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడ ప్రతిష్టించిన కూరేశుల మూర్తి సజీవమైనదని భక్తుల నమ్మకం. స్వామి విగ్రహానికి ఉన్న గడ్డం యేటా పెరుగుతుందని భక్తుల నమ్మకం. నంబులాద్రి స్వామి ఆలయంలో మొదట కూరేశుల దర్శనం, అండాళ్ దర్శనం అనంతరం స్వామి దర్శనం చేసుకుంటారు.