Koppula Eshwar | ధర్మారం, మే 21 : ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పై ప్రజలకు జవాబు చెప్పాల్సింది పోయి.. దానిని ప్రశ్నించిన తన ఆస్తులపై విచారణ జరపాలని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అర్థరహితమని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దీనిపై కొప్పుల ఈశ్వర్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలో పాటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ మండల నాయకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ప్రెస్ మీట్ కు సిద్ధం కాగా కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం పూరితంగా తమ పార్టీ నాయకులు పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
అకారణంగా తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ దౌర్జన్యంగా దాడి చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. లక్ష్మణ్ కుమార్ చేసిన అభివృద్ధిపై వివరించే ధైర్యం లేక తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాడని కొప్పుల మండిపడ్డారు. తన ఆస్తులపై లక్ష్మణ్ కుమార్ విచారణ జరిపిస్తానని చేసిన ప్రకటనపై తాను సిద్ధంగా ఉన్నానని, ఆయన ఆస్తులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. తాను నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశానని, అభివృద్ధి సేవలు గురించి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని, ఏ గ్రామానికి వెళ్లినా తన మార్క్ ఉంటుందని ఈశ్వర్ స్పష్టం చేశారు. కానీ తన పదవీకాలంలో ఎవరిపై కూడా కుట్రపూరితంగా వ్యవహరించలేదని అన్నారు.
కానీ లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే ప్రధాన పనిగా పెట్టుకున్నాడని, గతంలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నాడని ఈశ్వర్ ఆరోపించారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే వారిపైన దాడులు చేయించడం లేదా పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడమే లక్ష్మణ్ కుమార్ ఘనకార్యమని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఆరు సహకార సంఘాలపై లక్ష్మణ్ కుమార్ స్వయంగా ఫిర్యాదు చేయగా కోర్టు విచారణ జరిపి వాటిల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని మొట్టికాయలు వేసినా ఆయనకు బుద్ధి రాలేదని ఈశ్వర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను అడ్డుకోవడంతోపాటు వెల్గటూరు మండలం చెగ్యం ఇతర మండలాల్లో కొంతమంది ఎస్సీ, బీసీలు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని తాను ప్రతిపాదిస్తే వాటిని రద్దు చేయాలని లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ ఫిర్యాదు చేశాడని ఆరోపించారు. ధర్మపురి లో ట్రాక్టర్ యజమానులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే వారి ట్రాక్టర్లు ఆరు నెలలు నడవకుండా చేసి లక్ష్మణ్ కుమార్ వారి పొట్ట కొట్టాడని ఈశ్వర్ ఆరోపించారు.
లక్ష్మణ్ కుమార్ తమ ప్రభుత్వ హయాంలో నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జార్జి రెడ్డి గూడెంలో ఇసుక క్వారీ నిర్వహించినప్పటికీ తాను ఎన్నడూ దానిపై ప్రస్తావించలేదని ఆయన గుర్తు చేశారు. కానీ లక్ష్మణ్ కుమార్ తన కుటుంబ సభ్యులు గురించి దిగజారి మాట్లాడని ఈశ్వర్ తప్పు పట్టారు. తాను ఎమ్మెల్యే పదవిలో ఉన్నానని ఇష్టానుసారంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడితే సహించేది లేదని తెలిపారు. హైదరాబాదులో మాజీ మంత్రి మల్లారెడ్డి దగ్గర తనకు వెయ్యి గజాల భూమి ఉందని, ఆ భూమిని మల్లారెడ్డి ఆక్రమించాడని లక్ష్మణ్ కుమార్ ఎంతో గోల చేశాడని, అక్కడ ఒక గజం భూమికి రూ.లక్ష విలువ ఉంటుందని, మరి ఆ భూమిని లక్ష్మణ్ కుమార్ ఎలా కొనుగోలు చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలని ఈశ్వర్ సవాల్ చేశారు.
ఎమ్మెల్యే గెలిచిన లక్షణ్ కుమార్ ఏడాది గడవకముందే కరీంనగర్ లో కొత్తగా ఎలా ఇల్లు కడుతున్నాడో జవాబు చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. తన ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్ లోని పూర్తి వివరాలతో రాసిచ్చానని, దానిపై ఎలాంటి విచారణ అయిన చేసుకోవచ్చని ఈశ్వర్ స్పష్టం చేశారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని లక్ష్మణ్ కుమార్ హైకోర్టుకు వెళ్లగా ఆ ఎన్నిక సక్రమంగానే జరిగిందని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ లక్ష్మణ్ కుమార్ వ్యతిరేకంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇకనైనా లక్ష్మణ్ కుమార్ అభివృద్ధిపై దృష్టి సారించి తనపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఈశ్వర్ హితవు పలికారు.