రామగిరి, జూలై 18: కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నవ్విపోదురు కదా అనే విధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పెండింగ్ బిల్లులు రాక ఎంతోమంది సర్పంచులు ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నా చలనం లేని ఈ ప్రభుత్వంనికి కనువిప్పు కలగాలని హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ధర్నాకు బయలుదేరిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేయిస్తున్నది. రామగిరి మండలంలో తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అడిగినందుకు ఇవ్వకపోగా అక్రమ అరెస్టులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని పెద్దపల్లి జిల్లా సర్పంచుల పోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండవేన ఓదెల యాదవ్ అన్నారు. అప్పుచేసి మరి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించిన సర్పంచుల కుటుంబాలు చిన్న భిన్నంగా మారాయని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలు, రాజ్యాంగం మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి పెండింగ్ బిల్లులే సాక్షమన్నారు.
గత ఎన్నికల్లో గెలుపొందింది 95 శాతం బీఆర్ఎస్ సర్పంచులే కాబట్టి వారు చేసిన పనులకు బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని విమర్శించారు. స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసేనాటికే ఎన్నికలు నిర్వహించాలన్న కనీస అవగాహన లేని దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. 420 హామీలు, ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్.. ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయని కాంగ్రెస్ సర్కార్.. స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు జంకుతున్నదని చెప్పారు. వెంటనే ఎన్నికలు నిర్వహించి చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు.