పెద్దపల్లి, ఫిబ్రవరి 17( నమస్తే తెలంగాణ) : ఉద్యమ నేత తెలంగాణ ప్రదాత కేసీఆర్ జన్మదినాన్ని(KCR birthday) పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జయదుర్గ అమ్మవారి ఆలయంలో రామానంద భారతి మహా స్వామి, శ్రీరాంభట్ల శివ శర్మ సమక్షంలో 25 మంది రుత్వికులతో ఆయుష్షు హోమాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని, తిరిగి మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని కాంక్షిస్తూ ఆయుష్ హోమాన్ని నిర్వహించామన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాక పూర్వం ఈ ప్రాంతం వెనుకబడి ఉండేదన్నారు. నీళ్లు, నిధులు, వనరులు ఉండి నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం అన్నారు. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా మారిందని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలతో తల్లడిల్లిన ప్రాంతాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెంట రాజేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.