సెప్టెంబర్ 10: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలోని అన్నదాత ఆగ్రోస్ కేంద్రం గోదాం నుంచి మంగళవారం రాత్రి అక్రమంగా ట్రాక్టర్, ఆటోలో వేరువేరుగా అక్రమంగా యూరియాను తరలించే ప్రయత్నం చేయగా గ్రామ రైతులు అడ్డుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆగ్రోస్ కేంద్రానికి 220 యూరియా బస్తాలు వచ్చాయి. వాటిని బుధవారం రైతులకు స్థానిక ఏఈఓ సమక్షంలో పంపిణీ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం యూరియాను రైతుల ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం ఆధారంగా ప్రత్యేక యాప్ లో వారి పేర్లను నమోదు చేసి ఓటిపి వచ్చిన తర్వాత పంపిణీ చేస్తారు.
కానీ అట్టి నిబంధనలకు విరుద్ధంగా సుమారు రాత్రి పది గంటల సమయంలో దుకాణం అనుబంధంగా ఉన్న గోదాం నుంచి దుకాణం యజమాని దొంగ చాటుగా యూరియా బస్తాలను విక్రయించే ప్రయత్నం చేయగా రైతులు దానిని గుట్టురట్టు చేశారు. 22 యూరియా బస్తాలను ట్రాక్టర్ ,ఆటోలో తరలిస్తున్నట్లు సమాచారం తెలియడంతో రైతులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా ఇస్తుండగా పెద్ద మొత్తంలో యూరియా బస్తాలను ఎలా విక్రయిస్తారని రైతులు ప్రశ్నించారు. ఈ విషయాన్ని గ్రామస్తులు కొందరు సోషల్ మీడియాలో యూరియా తరలింపు పై పోస్టులు చేయడంతో వెలుగు చేసింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అట్టి వాహనాల్లోని యూరియాను తిరిగి గోదాంలోకి తరలించారు. ఈ సంఘటనపై ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ను నమస్తే తెలంగాణ వివరణ కోరగా యూరియా అక్రమ తరలింపుపై శాఖ పరంగా విచారణ జరిపి తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు. ఓవైపు యూరియా సరిపడా దొరకక రైతులు ఆందోళన చేస్తుంటే యూరియా అక్రమ తరలింపు ప్రయత్నంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా యూరియా ఆక్రమ రవాణాను అడ్డుకొని న్యాయం చేయాలని రైతులకు డిమాండ్ చేస్తున్నారు.