Farmer Registry | రామగిరి, మే 28 : డిజిటల్ పట్టా పాస్ బుక్ కలిగిన ప్రతీ రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ తెలిపారు. బేగంపేట గ్రామంలో ఫార్మా రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ఆయన బుధవారం పరిశీలించారు.
రైతులు తమ ఆధార్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానించబడిన మొబైల్ తో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద ఫార్మర్ రిజిస్టర్ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆధార్ తో దేశంలోని ప్రతీ పౌరుని కి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతీ రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య (యూనిక్ కోడ్ ) ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు.
భూమి ఉన్న ప్రతీ రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరములతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందేందుకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు నవీన్, అరవింద్, మౌనిక రైతులు పాల్గొన్నారు.