INDW vs AUSW : సొంతగడ్డపై ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. పొట్టి సిరీస్ తొలిపోరు కంగుతిన్న ఆతిథ్య జట్టు రెండో మ్యాచ్‌లో భారత్‌కు షాకిచ్చింది. ఓపెనర్లు జార్జియా వోల్(88), బేత్ మూనీ(46)ల విధ్వంసంతో టీమిండియాకు సవాల్ విసిరిన ఆసీస్.. బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. హర్మన్‌ప్రీత్ కౌర్(36) పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలమవ్వడం విజయావకాశాల్ని దెబ్బతీసింది. అష్లే గార్డ్నర్ (3-22) తిప్పేయగా 19 పరుగుల తేడాతో గెలుపొందిన కంగారూ టీమ్.. మూడు టీ20ల సిరీస్‌ను సమం చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో తేలిపోయింది. పేసర్లు రేణుకా సింగ్.. క్రాంతి గౌడ్లు ఆరంభంలోనే వికెట్ తీయకపోవడంతో ఓపెనర్లు జార్జ్ వోల్(88), బేత్ మూనీ(46)లు చెలరేగిపోయారు. పోటీపోటీగా బౌండరీలతో టీమిండియా బౌలింగ్ దళంపై విరుచుకుపడిన ఇద్దరూ.. తొలి వికెకు సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు బాటలు వేశారు.
Harmanpreet’s dismissal starts a collapse of 6 wickets for 7 runs as Australia bounce back to level the T20I series in Canberra!
Scorecard: https://t.co/0Uyw8hixiG pic.twitter.com/qbOp8SX6dJ
— ESPNcricinfo (@ESPNcricinfo) February 19, 2026
ఆసీస్ నిర్దేశించిన 164 పరుగుల ఛేదనలో ఓపెనర్లు స్మృతి మంధాన(31), షఫాలీ వర్మ(29)లు ధనాధన్ ఆడినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఆసీస్ సారథి మొలినెక్స్ ఓవర్లో షఫాలీ వెనుదిరగగా.. డేంజరస్ మంధానను కిమ్ గార్త్(2-16) పెవిలియన్ పంపింది. జెమీమా రోడ్రిగ్స్(4) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(36), రీచా ఘోష్(19)లు కాసేపు పోరాడారు. కానీ.. హర్మన్‌ప్రీత్‌ను గార్త్ ఔట్ చేయడమే ఆలస్యం భారత జట్టు టకటకా వికెట్లు కోల్పోయింది.
హర్మన్‌ప్రీత్ వెనుదిరిగినా.. మన్జోత్ కౌర్, దీప్తి శర్మ, రీచా ఘోష్‌లు ఉన్నారులే గెలుస్తామనిపించింది. కానీ, అనూహ్యంగా హర్మన్ ఔటయ్యేసరికి 124-4తో ఉన్న టీమిండియా.. ఏడు పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. గార్డ్నర్ 3 వికెట్లతో రాణించగా.. 19 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్ పొట్టి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఫిబ్రవరి 21న అడిలైడ్ ఓవల్‌లో నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది.