Health tips : మధుమేహం (షుగర్ వ్యాధి – Diabetis) ఉన్నవాళ్లు తమ ఆరోగ్యం (Health) విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తీపి పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే తీపి పదార్థాలవల్ల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అయితే సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ అందుబాటులో ఉంటున్న స్వీట్ కార్న్ (Sweet corn) ను తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఇందుకు మధుమేహులు కూడా అతీతం కాదు. కానీ షుగర్ పేషెంట్స్ స్వీట్ కార్న్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా.. కాదా..? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఆ సందేహాలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..!
చాలామంది స్వీట్ కార్న్‌ను ఉడికించి ఉప్పు, కారం రాసుకుని తింటారు. కొంతమంది దీనిని సలాడ్లు, కూరగాయలలో కూడా ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అంతే రుచికరంగా ఉంటుంది. స్వీట్ కార్న్‌లో ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, సెలీనియం, విటమిన్ సి, విటమిన్లు బి1, బి2, బి3, బి6, ఎ2 వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. శరీర పోషక అవసరాలను తీర్చడంలో సాయపడతాయి.
అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. డయాబెటిస్ పేషెంట్స్ స్వీట్ కార్న్‌ను అతిగా కాకుండా మితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సాయపడుతుంది. అయితే దీన్ని ఉడికించిన కూరగాయలు, వెజ్ సలాడ్లతో తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరీ ఎక్కువగా కాకుండా తరచుగా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు.
సాధారణంగా స్వీట్ కార్న్‌లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలోని చక్కెరలో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది. ఇది శక్తికి మంచి మూలం. బి విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను నియంత్రించడంలో సాయపడతాయి. ఉడికించిన మొక్కజొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.