జూలపల్లి, ఆగస్టు 5: శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ డీ-83 ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువల మరమ్మతులపై నిర్లక్ష్యం ఆవరిస్తోంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు శ్రద్ధ తీసుకోకపోవడంతో కాలువలు చిన్నా భిన్నమవుతున్నాయి. పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలంలో ఎస్సారెస్పీ కాలువలు అధ్వాన్నంగా మారాయి. ఆలనా పాలన కరువై అధికారుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నాయి. అబ్బాపూర్, జూలపల్లి, కుమ్మరికుంట, కాచాపూర్ దాకా దాదాపు 13 కిలోమీటర్ల పొడవున డీ-83 ప్రధాన కాలువ ప్రవహిస్తోంది.
ఈ కాలువ ఎడమ, కుడివైపు ఉప కాలవలు, పిల్ల కాలువలు ఉన్నాయి. ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలు పిల్ల కాలువలు పగుళ్లు, గుంతలు పడి బండరాళ్లు తేలి చెట్లు, వృక్షాలతో నిండి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదు. కాలువలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టకపోవడంతో సాగునీరు పంటలకు అందక రైతులకు కష్టాలు తప్పడం లేదు. దీంతో సాగునీరు వృధా పోతుండగా రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. కాలువల నిర్వహణ కరువై రైతులు ఇబ్బందులు పడుతున్నారు.