రామగుండం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు (Sripada Rao) 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీ ఎం.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మంథని ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన శ్రీపాదరావు స్పీకర్‌గా పనిచేశారన్నారు. కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన శ్రీపాదరావు సర్పంచ్‌గా, సమితి ఉపాధ్యక్షుడిగా ఎల్ఎంబీ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
1983 నుంచి వరుసగా మూడుసార్లు మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు హత్య చేశారు. సర్పంచ్ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి, శాసనసభ్యుడిగా, శాసన సభాదిపతిగా పదవి చేపట్టి పదవికే వన్నె తెచ్చారని అన్నారు. రాష్ట్రానికి ఎనలేని సేవచేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రవుగా పేరుగాంచారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఆర్ఐ వామన మూర్తి, శ్రీనివాస్, సంపత్, సీసీ హరీష్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.