జూలపల్లి, ఆగస్టు 04: ఆ గ్రామాల మధ్య మట్టి రోడ్లపై ప్రయాణం ఇబ్బందిగా మారుతున్నది. వానా కాలంలో కనీసం నడిసి వెళ్లే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ వాహనాలు బురదలో దిగబడి మురయిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి (Julapalli) మండలంలోని కోనరావుపేట-తెలుకుంట్ల, వడ్కాపూర్-వెంకట్రావుపల్లి, వడ్కాపూర్-కీచురాటపల్లి, పెద్దాపూర్-కురుమపల్లె గ్రామాల మధ్య మట్టి రోడ్లు ఉన్నాయి. గుంతలు, నీటి నిల్వలు తప్పించుకుంటూ వాహనాలు నడుపుతూ అదుపుతప్పి కింద పడిపోతున్నారు. బురదతో నిండిన మట్టిరోడ్లపై వాహనాలు నడపడం సర్కస్ ఫీట్లను తలపిస్తున్నాయి. ఈ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి మట్టిరోడ్లపై ప్రయాణం తప్పడం లేదు. చిన్నపాటి వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిని ముప్పు తిప్పలు పడుతున్నారు. ఈ రోడ్లను వదిలేసి వేరే మార్గాలు ఎంచుకొని దాదాపు మూడు కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తారు రోడ్లుగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.