మంథని/ ముత్తారం , మార్చి 26: రెవెన్యూ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం ఆయన మంథని, ముత్తారం, మండలాలలో విస్తృతంగా పర్యటించారు. మంథని మండలంలోని నిర్మాణం అవుతున్న నూతన పురపాలక భవన పనులను, ముత్తారం మండలం ధర్యాపూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాలను, వసతి గృహం, అక్కడ ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అధికారులతో సమీక్షిస్తూ జాతీయ రహదారి 163 జీ కింద ముత్తారం మండలం లక్కారం గ్రామంలో సేకరించిన భూములలో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన నగదు నిర్వాసితులకు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బోరు బావులు, చెట్లు, ఇతర నిర్మాణాలకు పరిహార నిధులు ప్రతిపాదనలను సంబంధిత అధికారులు వెంటనే జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ కు పంపి త్వరగా మంజూరు అయ్యేలా చూడాలన్నారు. డివిజన్ పరిధిలో భూ శుద్ధీకరణ సమయంలో జరిగిన తప్పులు సరి చేసే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు సర్వే రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చెరువుల ఎఫ్టిఎల్, బఫర్ జోన్ పరిధి నిర్ధారించాలని ఆదేశించారు. చెరువు భూములలో ఆక్రమణలు ఎక్కడైనా జరిగితే వెంటనే రికవరీ చేయాలని అన్నారు. మంథని పట్టణంలో నిర్మాణం అవుతున్న నూతన పురపాలక భవనం పనులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ముత్తారం మండలంలోని, ధర్యాపూర్ ఆదర్శ పాఠశాల వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించి పిల్లల డార్మెంటరీ, భోజనశాల, వంటగది పరిశీలించారు. పిల్లలకు అందుతున్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదర్శ పాఠశాలలో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూ సేకరణ పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఆన్లైన్ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.